నటీనటులు : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ తదితరులు
సినిమాటోగ్రఫీ : అమిత్ రాయ్
సంగీతం : విశాల్ మిశ్రా, జాని, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్
నేపథ్య సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్
నిర్మాణం : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా
కథ-ఎడిటింగ్-దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
Ranbir Kapoor Animal Review అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఒకే కథను టాలీవుడ్, బాలీవుడ్ లో తీసి హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేశాడు. టీ సీరీస్ నిర్మించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
దేశంలోనే అత్యంత సంపన్నుడైన బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) స్వస్తిక్ స్టీల్స్ అధినేతగా ఉంటాడు. అతని తనయుడు రణ్ విజయ్ సింగ్ చాలా ధైర్యవంతుడు. ఎలాంటి సమస్యనైనా ఎదురించి నిలబడతాడు. చిన్నప్పటి నుంచి నాన్నంటే ఎంతో ప్రేమగా ఉంటాడు. అయితే తన బిజినెస్ వ్యవహారాల్లో పడి విజయ్ ని అసలు పట్టించుకోడు. అదీగాక అతను చేస్తున్న పనుల వల్ల బల్బీర్ సింగ్ కి చెడ్డపేరు వస్తుంది. ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ క్రమంలో ప్రేమించిన గీతాంజలి (రష్మిక)ని పెళ్లాడి అమెరికా వెళ్తాడు రణ్ విజయ్ సింగ్. కొన్నేళ్ల తర్వాత తండ్రిపై హత్యాహత్నం జరిగిందని తెలిసి తన భార్యా పిల్లలతో ఇండియాకు వస్తాడు. రణ్ విజయ్ సింగ్ ఇండియాకు వచ్చాక ఏం జరిగింది..? తండ్రిని హత్య చేయాలనుకున్న వారిని విజయ్ ఏం చేశాడు..? ఇంతకీ బల్బీర్ సింగ్ శత్రువు ఎవరు..? వారి నుంచి ఫ్యామిలీని విజయ్ ఎలా కాపాడుకున్నాడు అన్నది సినిమా కథ.
కథనం – విశ్లేషణ :
అర్జున్ రెడ్డిలో లవ్ స్టోరీ చూపించిన సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో తండ్రి కొడుకుల కథతో తెరకెక్కించాడు. అర్జున్ రెడ్డి లాంటి కొడుక్కి తన తండ్రితో జరిగే ఎమోషనల్ కథనే యానిమల్. యానిమల్ కథ విషయానికి వస్తే ఇదేమి కొత్త కథ కాదు. కథగా చూస్తే చాలా సినిమాలే మైండ్లోకి వస్తాయి. కానీ డైరెక్టర్ తనదైన స్టైల్ లో క్యారెక్టరైజేషన్ తో సినిమాను నడిపించాడు.
హీరో పాత్ర, డైలాగ్స్ ఇవన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తండ్రిపైన చెప్పలేనంత ప్రేమ ఉన్న కొడుకు జీవితన్ని తెర మీద చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి తరహాలో కథను హీరో చైల్డ్ హుడ్ సీన్స్, లవ్ సీన్స్ తో కథను నడిపించాడు. తన సిస్టర్ ని ర్యాగింగ్ చేశారని కాలేజ్ కి గన్ తీసుకెళ్లి చేసిన హంగామా ఆడియన్స్ ని మెప్పిస్తుంది.
యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ పాత్ర అర్జున్ రెడ్డిని చూసే రాసుకున్నట్టు ఉంటుంది. అయితే దానికి మించేలా ఈ పాత్ర ఉందని చెప్పొచ్చు. సినిమాలో భావోద్వేగాలు ప్రధాన బలంగా సాగాయి. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ప్రేక్షకులను అలరించగా సెకండ్ హాఫ్ కాస్త నిడివి ఎక్కువ ఉందన్న మాట వినపడుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అంతా బాగున్నా సెకండ్ హాఫ్ మొదటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో కాస్త తడపడినట్టు అనిపిస్తుంది.
సినిమా 3 గంటల పైన రన్ టైం ఉంటుందని సందీప్ రెడ్డి వంగ ముందే చెప్పాడు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చూడాలి. బలమైన క్యారెక్టరైజేషన్ ను రాసుకోవడంలో సందీప్ రెడ్డి వంగా మరోసారి తన ప్రతిభ చాటాడు. ఇక చివర్లో సినిమా కొనసాగుతుందని చూపించిన సీన్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. కాస్త వైలెన్స్ ఎక్కువైందన్నట్టు అనిపించినా పాత్రలకు కనెక్ట్ అయిన వారు అడ్జెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే పాత్రలకు కనెక్ట్ కాని వారు మాత్రం సినిమాను ఎంజాయ్ చేయలేరు.
నటీనటులు :
రణ్ బీర్ కపూర్ తన విశ్వరూపం చూపించాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం రణ్ బీర్ ఈ సినిమాలో చూపించిన అభినయం చూసి షాక్ అవుతారని చెప్పొచ్చు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేశాడు రణ్ బీర్ కపూర్. ఇక సినిమాలో అనిల్ కపూర్ పాత్ర కూడా మెప్పించింది. రష్మికకు మంచి సీన్స్ పడ్డాయి. బాబీ డియోల్ పాత్ర అనుకున్నంత హైప్ రాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పాత్రదారులంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాకు సందీప్ రెడ్డి కి ఈక్వల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అదరగొట్టాడు. సినిమా హైలెట్స్ లో మ్యూజిక్ కూడా ఒకటి. ఇక మరోపక్క సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. సినిమా థీం కి తగినట్టుగా కలరింగ్ ఉంది. సినిమాకు ప్రధాన బలాలుగా మ్యూజిక్, కెమెరా వర్క్ నిలిచింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన వరకు ది బెస్ట్ వర్క్ చేశాడు. అయితే నిడివి విషయంలో కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.
బాటం లైన్ :
యానిమల్.. ఫాదర్ అండ్ సన్ వైలెంట్ ఎమోషన్..!
We’re now on WhatsApp : Click to Join