Nayakudu Telugu Movie Review : నాయకుడు మూవీ రివ్యూ

రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు..ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు.

Nayakudu Telugu Movie Review: రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు. ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు. కీర్తి సురేష్ ఎన్నడూ చేయని రోల్ లో చాలా అద్భుతంగా మెప్పించింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది.

కథ:

రఘువీరా (ఉదయనిధి స్టాలిన్) ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. అతని తండ్రి తిమ్మరాజు (వడివేలు) రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే. లీల (కీర్తి సురేష్), రఘువీరా క్లాస్‌మేట్. కాలేజీ రోజుల నుంచి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ కనీసం మాట్లాడుకోరు కూడా. కాలేజీ అయిపోయాక లీల పేదవారికి ఉచితంగా విద్య అందించడం కోసం ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తుంది. కానీ దానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ బిల్డింగ్ కోసం తిమ్మరాజు దగ్గరకు వస్తారు. అప్పుడు రఘువీరా తన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ఇన్‌స్టిట్యూట్ కోసం ఇచ్చేస్తాడు.

ఒకరోజు కొంతమంది రౌడీలు బిల్డింగ్‌పై దాడి చేసి మొత్తం ధ్వంసం చేస్తారు. తిమ్మరాజు పార్టీకే చెందిన రత్నవేలు (ఫహాద్ ఫాజిల్) అన్న (సునీల్ రెడ్డి) హస్తం దీని వెనక ఉన్నట్లు తెలుస్తుంది. గొడవ పెద్దది కావడంతో సెటిల్ చేయడానికి రత్నవేలు దిగుతాడు. ఆ తర్వాత ఏం అయింది? రఘువీరా తన తండ్రి తిమ్మరాజుతో ఎందుకు మాట్లాడటం లేదు? ఇది కులాల మధ్య గొడవగా ఎలా మారింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

తమిళ దర్శకుల్లో మారి సెల్వరాజ్‌ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో కథ కంటే సన్నివేశాలు ఎక్కువగా మాట్లాడతాయి. మారి సెల్వరాజ్ గత రెండు సినిమాల తరహాలోనే ఈసారి కూడా కుల సమస్యనే ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభంలోనే రెండు సీన్లను సమాంతరంగా నడిపిస్తూ హీరో, విలన్ ఇద్దరి పాత్రలనూ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోకు పందులంటే చాలా ఇష్టం. దీని కారణంగా కొన్ని పందులను పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు విలన్ కుక్కలను పెంచుతూ ఉంటాడు. తనకు వాటి మీద ప్రేమ ఉండదు. కేవలం రేసుల కోసం పెంచుతాడు. వాటిలో ఏదైనా రేసులో ఓడిపోతే దారుణంగా కొట్టి చంపడానికి కూడా వెనుకాడడు. ఇలా వారి ఐడియాలజీ మధ్య విభేదాలను కూడా సినిమా ప్రారంభ సన్నివేశాల్లోనే చూపించేస్తాడు.

ప్రథమార్థం అంతా పాత్రలు, వాటి ఐడియాలజీలను పరిచయం చేయడం, కీలకమైన అన్ని పాత్రల మధ్య ఫేస్ ఆఫ్‌కు రెడీ చేయడంలోనే అయిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే ద్వితీయార్థం చాలా రేసీగా సాగుతుంది. రాజకీయ పోరాటం, ఎత్తులు, వాటికి పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. మారి సెల్వరాజ్ మార్కు మాత్రం ఎక్కడా మిస్ కాదు. శాంతిని కోరుకునే వడివేలు పాత్ర ఆలోచించేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బుద్ధుడి విగ్రహాన్ని చూపించడం వంటి ఇంట్రస్టింగ్ షాట్లు సినిమాలో చాలా ఉన్నాయి.

సినిమాకు ప్రధాన హైలెట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పవచ్చు. ఉదయనిధి స్టాలిన్‌లోని పెర్ఫార్మర్‌ను ఈ సీన్‌లో చూడవచ్చు. అలాగే క్లైమ్యాక్స్ కూడా ఆకట్టుకుంటుంది. మనసు నిండా ఒక రకమైన సంతృప్తితో ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాలో డైలాగ్స్ కూడా బలంగా రాశారు. ‘నిన్ను కూర్చోనివ్వకపోవడం నా అధికారం. నీ కొడుకుని కూర్చోమనడం నా రాజకీయం.’ అంటూ ఫహాద్ ఫాజిల్ చెప్పే డైలాగ్ తన క్యారెక్టరైజేషన్, ఇంటెలిజెన్స్‌కు అద్దం పడుతుంది. ‘ఆయన కూర్చోలేదు సరే మీరు ఎందుకు కూర్చోమనలేదు?’ అని ఉదయనిధి స్టాలిన్ వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది.

ఈ సినిమా నిడివి రెండు గంటల 37 నిమిషాలు ఉంది. అయితే ప్రథమార్థంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేయవచ్చు. పాత్రల పరిచయం వేగంగా చేసిన మారి సెల్వరాజ్… ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ ఫ్లాష్ బ్యాక్ దగ్గర మాత్రం కాస్త నెమ్మదించాడు. ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు, పాటను ఈజీగా ట్రిమ్ చేస్తే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. కానీ ఉదయనిధి స్టాలిన్ చిన్నప్పటి ఫ్లాష్‌బ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తను ఎందుకు రెబల్ అయ్యాడు అనే విషయాన్ని చాలా చక్కగా, కన్విన్సింగ్‌గా మారి సెల్వరాజ్ ప్రెజెంట్ చేశారు.

సినిమాకు మరో బలం ఏఆర్ రెహమాన్ సంగీతం. ఆయన స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు పిల్లర్స్‌గా నిలిచాయి. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఉదయనిధి స్టాలినే కాబట్టి ఖర్చుకు వెనకాడలేదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. వడివేలు ఈ సినిమాలో సర్‌ప్రయిజ్ ప్యాకేజ్. తమిళనాట వడివేలు కొన్ని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసి ఉండవచ్చు. కానీ తెలుగువారికి వడివేలును ఇలా చూడటం ఒక కొత్తగా ఉంటుంది. ప్రథమార్థంలో అమాయకుడిగా, నిస్సహాయుడిగా, ద్వితీయార్థంలో కొడుకు కోసం ఎవరికైనా ఎదురు నిలిచే ధైర్యవంతుడిగా వడివేలు నటన ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కారులో ఫహాద్ ఫాజిల్‌కు వార్నింగ్ ఇచ్చే సీన్‌లో, ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి కత్తి పట్టుకుని ఇంట్లో విలన్ కోసం ఎదురు చూసే సీన్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లో ఫహాద్ ఫాజిల్ ఎంత బాగా నటిస్తాడో అందరికీ తెలిసిందే. తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లో ఇది కూడా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్‌లో తనకు లభించిన బెస్ట్ రోల్ ఇదే. కీర్తి సురేష్‌ పాత్రకు నటనలో మంచి స్కోప్ ఉంది. లీల పాత్రలో ఒదిగిపోయింది. మిగతా పాత్రధారులందరూ తమ పరిధి మేరకు నటించారు.

నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు, లాల్, సునీల్ రెడ్డి తదితరులు
ఛాయాగ్రహణం : తేని ఈశ్వర్
ఎడిటర్ : ఆర్కే సెల్వ
సంగీతం : ఏఆర్ రెహమాన్
నిర్మాణ సంస్థ : రెడ్ జెయింట్ మూవీస్
నిర్మాత : ఉదయనిధి స్టాలిన్
రచన, దర్శకత్వం : మారి సెల్వరాజ్
విడుదల తేదీ : జూలై 14, 2023

Also Read:  Baby Telugu Movie Review : ‘బేబీ’ తెలుగు మూవీ రివ్యూ