Site icon HashtagU Telugu

Mahesh Babu Guntur Karam Review & Rating రివ్యూ : గుంటూరు కారం

Mahesh Babu Guntur Karam Review & Rating

Mahesh Babu Guntur Karam Review & Rating

Mahesh Babu Guntur Karam Review & Rating త్రివిక్రం మహేష్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా వచ్చిన సినిమా గుంటూరు కారం. హారిక హాసిని బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. సంక్రాంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

We’re now on WhatsApp : Click to Join

కథ :

గుంటూరులో ఉండే వెంకట రమణ (మహేష్ బాబు) చిన్నప్పుడే తల్లికి దూరమవుతాడు. తండ్రి కూడా హత్య కేసులో జైలుకి వెళ్తాడు. తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్తుంది. గుంటూరులో మేనత్త దగ్గర ఉంటూ మిర్చి బిజినెస్ చేస్తుంటాడు. అలా సాగిపోతున్న అతనికి రాజకీయ నేత రమణ తాత వెంకటసామి (ప్రకాశ్ రాజ్) నుంచి పిలుపువస్తుంది. తల్లి ఆస్తి మీద తనకు వాటా లేదని ఆమెతో ఎలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకునేందుకు అతన్ని పిలుస్తారు. రమణ వాళ్లు అడిగిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడ.. ఈ గొడవ ఎలా మొదలైంది..? అసలు రమణని తల్లి ఎందుకు వదిలి వెళ్లింది..? చివరగా రమణ తల్లికి దగ్గరయ్యాడా లేదా..? అన్నది సినిమా కథ.

కథనం – విశ్లేషణ :

త్రివిక్రం డైరెక్షన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు చేశాడు మహేష్. అతడులో మహేష్ క్యారెక్టరైజేషన్, ఖలేజాలో మహేష్ పంచ్ డైలాగ్స్ ఆ సినిమాలను నిలబెట్టాయి. అతడు కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా.. ఖలేజా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా ఆ తర్వాత టీవీల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇక వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం మీద భారీ హైప్ ఏర్పడింది.

అయితే ఎప్పుడైతే అంచనాలు పెరుగుతాయో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గినా సినిమా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. గుంటూరు కారం విషయంలో అదే జరిగింది. ఎప్పటిలానే ఒకే ఒక్క లైన్ ని కథగా రాసుకున్న త్రివిక్రం దానికి అల్లుకునే కథనం.. తన మార్క్ మాటలు.. ఇదే ఆయన స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్. అయితే మిగతా సినిమాల్లో కనిపించే ఆయన మార్క్ డైలాగ్ రైటింగ్ ఈ సినిమాలో కనిపించలేదు.

కేవలం మహేష్ పాత్ర.. పంచ్ డైలాగ్స్ ఇవి బాగానే వర్క్ అవుట్ అయినా కథ, కథనం పెద్దగా ఎంగేజింగ్ గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా మహేష్ ఎనర్జీ మీద నడుస్తుంది. కామెడీ టైమింగ్.. యాక్షన్ ఇవన్నీ అలరిస్తాయి. సెకండ్ హాఫ్ మేజర్ రోల్ పోశించాల్సిన ఎమోషనల్ టచ్ మిస్ అవుతుంది. అప్పటికీ సెకండ్ హాఫ్ లో మహేష్ రెండు పాటల్లో డ్యాన్స్ తో ఆడియన్స్ కి ఊపు తెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక క్లైమాక్స్ లో కొద్దిగా పర్వాలేదు అనిపించారు.

గుంటూరు కారం సినిమా కంప్లీట్ గా మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమాలో మిగతా పాత్రలన్నీ కూడా సోసోగానే అనిపించాయి. ఎమోషన్ పండాల్సినంతగా పండలేదు. థమన్ మ్యూజిక్ కూడా సాంగ్స్ ఓకే కానీ బిజీఎం ఆశించిన స్థాయిలో లేదు. అయితే సంక్రాంతి సీజన్ మహేష్ వన్ మ్యాన్ షో కాబట్టి సినిమా ఫైనల్ టెస్ట్ లో పాస్ అయ్యిందనే చెప్పొచ్చు.

నటీనటులు :

సూపర్ స్టార్ మహేష్ వెంకట రమణ పాత్రలో ఇరగ్గొట్టేశాడు. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే ఉతికి ఆరేస్తాడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మహేష్. సినిమాలో తన పరంగా 100కి 100 శాతం ఇచ్చేశాడు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్, డ్యాన్స్ ఇవన్నీ మహేష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తాయి. హీరోయిన్ శ్రీ లీల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమెకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే కాదు కానీ డ్యాన్స్ మూమెంట్స్ తో మాత్రం ఊపేసింది. మీనాక్షి ఈ సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. రమ్యకృష్ణ పాత్రకు వెయిట్ ఉంది కానీ త్రివిక్రం ఆ పాత్రని సరిగా రాసుకోలేదని అనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ ఎప్పటిలానే ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. రావు రమేష్ సినిమా మొత్తం తాగుతూనే కనిపించి క్లైమాక్స్ డైలాగ్స్ తో పర్వాలేదు అనిపించాడు. జయరాం, ఈశ్వరి రావు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. జగపతి బాబు రెగ్యులర్ పాత్ర చేశాడు. మిగతా పాత్రలన్నీ పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం :

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. థమన్ మ్యూజిక్ సాంగ్స్ వరకు ఓకే కానీ బిజీఎం ఆశించినట్టుగా ఇవ్వలేదు. ఫైట్స్ లో సాంగ్స్ ఐడియా ఎవరిదో కానీ ఇంప్రెస్ చేయలేదు. హై ఇవ్వాల్సిన టైం లో డల్ అయ్యేలా చేశాడు. కథ కథనాల్లో త్రివిక్రం మ్యాజిక్ కనిపించలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రం తన మాటలను కూడా పొదుపుగా ఖర్చు చేశాడని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

బాటం లైన్ :

గుంటూరు కారం.. మహేష్ వన్ మ్యాన్ షో..!