Winter: చలికాలం మొదలయ్యింది అంటే చాలు అనేక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పగలడం, పెదవులు పొడిబారడం లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సార్లు ఈ సమస్య ఎక్కువగా మారి పెదవుల నుంచి రక్తం కూడా వస్తుంటుంది. అయితే ఇలాంటప్పుడు తప్పకుండా కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలామంది ఖరీదైన లిప్ బామ్స్, క్రీములు వంటివి వాడుతుంటారు. కానీ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాలు మన వంటింట్లోనే దాగి ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రకృతి మనకు ప్రసాదించిన అమృతం తేనె. ఆరోగ్య ప్రయోజనాలలో మాత్రమే కాకుండా సౌందర్య పోషణలో కూడా అగ్రస్థానంలో ఉంటుంది. ఇది ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్. అయితే స్వచ్ఛమైన తేనెను కొద్దిగా తీసుకుని మీ పెదవులపై పలుచని పొరలా రాయాలట. రోజులో రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా ఉంటాయట. మరింత మంచి ఫలితాల కోసం, రాత్రి పడుకునే ముందు తేనె రాసుకుని ఉదయాన్నే కడిగేయడం మంచిదని చెబుతున్నారు. కొబ్బరి నూనె కూడా ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మంలోకి సులభంగా ఇంకిపోయి, లోతైన పోషణను అందిస్తాయట.
ఇది పెదవులపై ఒక రక్షణ కవచంలా పనిచేసి, చల్లటి గాలుల నుంచి కాపాడుతుందని చెబుతున్నారు. కాగా కొద్దిగా కొబ్బరి నూనెను చేతివేళ్లపైకి తీసుకుని పెదవులకు రోజంతా అప్లై చేస్తూ ఉండాలట. ఇది పెదవులను హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, వాటికి సహజమైన మెరుపును కూడా ఇస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా వెన్నలాంటి పెదవుల కోసం రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా తాజా పాల మీగడను పెదవులపై రాసి, సున్నితంగా మర్దన చేసి రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పెదవులు పట్టులా మెత్తగా మారతాయని చెబుతున్నారు. అలాగే పెదవులపై పేరుకుపోయిన మృత కణాల వల్ల అవి నిర్జీవంగా, పొడిగా కనిపిస్తాయి. వీటిని తొలగించడానికి ఇంట్లోనే దొరికే వాటిని ఉపయోగించవచ్చు.
ఒక చెంచా చక్కెరలో కొన్ని చుక్కల ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలట. ఈ మిశ్రమంతో మీ పెదవులపై ఒక నిమిషం పాటు సున్నితంగా వలయాకారంలో రుద్దాలట. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసి, కొబ్బరి నూనె లేదా నెయ్యిని రాయాలని చెబుతున్నారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా, గులాబీ రంగులో ప్రకాశిస్తాయట. దోసకాయ ముక్కను కానీ లేదా దాని రసాన్ని కానీ తీసుకుని పెదవులపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలట. ఇది పెదవులను చల్లబరిచి, వాటికి తిరిగి జీవం పోస్తుందని చెబుతున్నారు.
Winter: చలికాలంలో పగిలిన పెదవులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Winter