. సోరియాసిస్‌కు కారణాలు, లక్షణాలు
. లక్షణాలు మరియు ప్రభావిత ప్రాంతాలు
. సోరియాసిస్ నియంత్రణకు జీవనశైలి మార్పులు
Psoriasis : సోరియాసిస్ అనేది చర్మాన్ని ప్రభావితం చేసే ఒక తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధి. ఇది కేవలం సాధారణ చర్మ సమస్య మాత్రమే కాదు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అసమతుల్యత కారణంగా వచ్చే ఆటోఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి బారిన పడినవారిలో చర్మంపై ఎర్రటి రంగులో పొరలు ఏర్పడి అవి పొలుసుల్లా ఊడిపోతూ తీవ్రమైన దురద, మంటను కలిగిస్తాయి. దీని వల్ల బాధితులు శారీరకంగానే కాక మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోరియాసిస్ పూర్తిగా నయం కాకపోయినా సరైన జీవనశైలి ఆహారం, వైద్య పర్యవేక్షణతో దీని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సాధారణంగా మన చర్మ కణాలు పుట్టి రాలిపోవడానికి సుమారు 28–30 రోజుల సమయం పడుతుంది. కానీ సోరియాసిస్ ఉన్నవారిలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. చర్మ కణాలు కొన్ని రోజుల వ్యవధిలోనే అధికంగా ఉత్పత్తి అయి చర్మంపై పేరుకుపోయి పొలుసుల్లా మారతాయి.
ఇది ప్రధానంగా రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాలను శత్రువులుగా భావించి దాడి చేయడం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి తలపై మోకాళ్లు, మోచేతులు, వెన్ను వంటి భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్య కారణాలు ఒత్తిడి, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యకర జీవనశైలి కూడా దీనికి దోహదపడతాయి. సోరియాసిస్ లక్షణాలు వ్యక్తివ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. చర్మంపై ఎర్రటి మచ్చలు వెండి రంగు పొలుసులు తీవ్రమైన దురద, చర్మం పగిలిపోవడం వంటి లక్షణాలు సాధారణం. కొందరిలో కీళ్ల నొప్పులు కూడా కనిపిస్తాయి దీనిని సోరియాటిక్ ఆర్థ్రైటిస్ అంటారు. ఈ లక్షణాలు మళ్లీ మళ్లీ ప్రబలడం వల్ల బాధితుల రోజువారీ జీవితం ప్రభావితమవుతుంది. సరైన చికిత్స లేకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
సోరియాసిస్‌ను నియంత్రించడంలో బలమైన రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆకుపచ్చని కూరగాయలు బ్రోకలీ, క్యాబేజీ వంటి పోషకాహారం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం యోగా చేయడం ద్వారా శరీరంలో వాపు తగ్గి, ఒత్తిడి నియంత్రణలోకి వస్తుంది. పసుపు వంటి సహజ ఔషధాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. పసుపులోని కర్కుమిన్ వాపును తగ్గించి రోగనిరోధక వ్యవస్థను సమతుల్యంలో ఉంచడంలో సహాయపడుతుంది. వీటితో పాటు చర్మ వైద్యుని సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం. ఇలా సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుంటే సోరియాసిస్ ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చు.
