Site icon HashtagU Telugu

Kid Diabetes: మీ పిల్లలకు డయాబెటిస్ నిర్ధారణ అయితే..ఏం చేయాలి?

Kid Diabetes

Kid Diabetes

Kid Diabetes: మధుమేహం అనేది ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ పిల్లలు, యుక్త వయస్కులను ప్రభావితం చేస్తోంది. 2022 జూన్ లో  ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) విడుదల చేసిన  నివేదిక  ప్రకారం.. భారతదేశంలో 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో టైప్ 1 మధుమేహం యొక్క 95,000కు పైగా కేసులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 15,000కు పైగా కేసులు నమోదవు తున్నాయి. పిల్లలలో అత్యంత సాధారణ రకం మధుమేహం టైప్ 1. ఇది శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే ఇన్సులిన్ అనే హార్మోన్‌ను శరీరం తగినంతగా ఉత్పత్తి చేయలేనప్పుడు వస్తుంది.  ఇన్సులిన్ లేకుండా శరీరం యొక్క కణాలు గ్లూకోజ్‌ను గ్రహించలేవు. ఇది రక్తంలో ప్రమాదకరమైన అధిక స్థాయి గ్లూకోజ్‌ స్థాయికి దారితీస్తుంది. పిల్లలలో 90% మధుమేహం కేసులు టైప్ 1కు చెందినవి కాగా, మిగిలినవి టైప్ 2 మధుమేహం.

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వివరాలు..

టైప్ 1 డయాబెటిస్‌ను ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా పిలుస్తారు. ఈ రకమైన డయాబెటిస్‌లో రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలపై దాడి చేసి నాశనం చేస్తుంది.  అయితే టైప్ 2 డయాబెటిస్ ను సాధారణంగా నాన్-ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్‌గా చెబుతారు. ఇది సాధారణంగా పెద్ద పిల్లలు, కౌమారదశలో ఉన్నవారికి సంభవిస్తుంది.

* ప్లేట్ పద్ధతిని అనుసరించండి

మీ పిల్లలకు సమతుల భోజనం అందించే విషయంలో ప్లేట్ పద్ధతి చాలా బెస్ట్. ఇందులో ఒక మోస్తరు పరిమాణ ప్లేట్‌ను ఉపయోగించండి. ఆ ప్లేట్ ను మూడు విభాగాలుగా విభజించండి. ప్లేట్‌లో మూడింట ఒక వంతు పండ్లు, కూరగాయలతో, మూడింట ఒక వంతు ప్రోటీన్‌తో, మిగిలిన మూడవ భాగాన్ని కార్బోహైడ్రేట్లతో నింపండి.  ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లను పూర్తిగా తొలగించకూడదనేది దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు.

* ఏమి తినకూడదు ?

పిల్లలు వీలైనంత వరకు జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం. ఇందులో కేకులు, బిస్కెట్లు, చిప్స్ , ఇతర బేకరీ వస్తువులు ఉంటాయి.  సందర్భానుసారంగా ఈ రకమైన ఆహారాలను మితంగా తీసుకోవడం సరైందే అయినప్పటికీ.. సాధారణంగా వాటి వినియోగాన్ని పరిమితం చేయాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

* పిల్లలు ఆడొచ్చా? క్రీడలలో పాల్గొనవచ్చా?

మధుమేహం ఉన్న పిల్లలు రోజుకు కనీసం ఒక గంట పాటు చురుకుగా ఉండేలా , శారీరక శ్రమలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.  అయినప్పటికీ వారి రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ క్రమంలో వారి రక్తంలో చక్కెర తగ్గే ప్రమాదం ఉంది.  పిల్లవాడి రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయడానికి గ్లూకోమీటర్ వాడండి.  రక్తంలో చక్కెర తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే, వారి రక్తంలో చక్కెరను సాధారణ స్థాయికి తీసుకురావడానికి వెంటనే అల్పాహారం ఇవ్వాలి.

ఇవి చేయండి…

● ప్రతి రోజు కనీసం 4 సార్లు రక్తంలో గ్లూకోజ్‌ని తనిఖీ చేయండి.
● ప్రతి రోజు కనీసం 4 సార్లు ఇన్సులిన్ తీసుకోవడం.
● మీరు తినే ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఎంత మోతాదులో ఉన్నాయో లెక్క చూసుకోవాలి.
● మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎందుకు పెరుగుతున్నాయి.. ఎందుకు తగ్గుతున్నాయి అనేది తెలుసుకోవాలి. వాటికి అనుగుణంగా మార్పులు చేయడం నేర్చుకోవాలి.
● మీ రక్తంలోని గ్లూకోజ్‌ని లక్ష్య పరిధిలో ఉంచండి.