Anant Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ 170 కిలోమీటర్ల ఆధ్యాత్మిక పాదయాత్ర ఆదివారమే ముగిసింది. మార్చి 29న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలుపెట్టిన ఈ యాత్రను ఆదివారం రోజు ద్వారకకు చేరాక ఆపేశారు. శ్రీరామనవమి పర్వదినంతోపాటు హిందూ క్యాలెండరు ప్రకారం తన పుట్టినరోజు నాడు ద్వారకాధీశుడి సన్నిధికి అనంత్ చేరుకోవడం విశేషం. ఈసందర్భంగా తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్‌లతో కలిసి శ్రీ కృష్ణుడిని అనంత్ దర్శించుకొని పూజలు చేశారు.
Also Read :Black Rice : బ్లాక్‌రైస్ వల్ల లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
అనంత్‌కు సెల్యూట్.. ఆయన సందేశమిదీ..
ఇంతకీ అనంత్ అంబానీ ఈ ఆధ్యాత్మిక పాదయాత్రను ఎందుకు చేశారు ? దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయా ? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ పాదయాత్ర క్రమంలో అనంత్(Anant Ambani) ప్రతిరోజు రాత్రి 7 గంటల వ్యవధిలో సగటున 20 కి.మీ దూరం నడిచారు. అనంత్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లలో కుషింగ్ సిండ్రోమ్ ముఖ్యమైందని అంటున్నారు. బాల్యం నుంచే హార్మోన్ల రుగ్మత ఉంటే దాన్నే కుషింగ్ సిండ్రోమ్ అంటారు. దీంతో పాటు అనంత్‌కు ఊబకాయం, థైరాయిడ్, ఉబ్బసం, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నాయట. ఈ ఆరోగ్య సమస్యలన్నీ ఉన్నా.. పాజిటివ్ థింకింగ్‌తో ఆయన వాటన్నింటిని జయించి ఆధ్యాత్మిక పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఈతరం యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆత్మ సంకల్పాన్ని మించిన బలం లేదని నిరూపించారు. యాత్రను పూర్తిచేసిన వేళ అనంత్ అంబానీ కీలక సందేశం ఇచ్చారు. ‘‘మీ భక్తి మిమ్మల్ని ముందుకు నడిపించనివ్వండి. అది సవినయంగా మిమ్మల్ని తీర్చిదిద్దనివ్వండి. జీవితం భారంగా అనిపించినపుడు.. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లనివ్వండి’’ అని అనంత్ పేర్కొన్నారు.
ఏమిటీ కుషింగ్ సిండ్రోమ్?
కుషింగ్ సిండ్రోమ్ అనేది మీ శరీరంలో కార్టిజాల్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు సంభవించే అరుదైన పరిస్థితి. దీన్నే హైపర్ కార్టిసోలిజం అని కూడా పిలుస్తారు. దీనివల్ల శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది. అనేక సమస్యలు వస్తాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్తపోటు పెరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. శ్వాస సమస్యలు వస్తాయి. కండరాల పనితీరు దెబ్బతింటుంది.
హైపోథాలమస్ నియంత్రణలోనే అంతా..
మన శరీరంలో బీపీ (బ్లడ్ ప్రెషర్)ని కంట్రోల్ చేయడంలో కార్టిజాల్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. బ్లడ్ షుగర్ నియంత్రణ, వాపును తగ్గించడం, శ్వాస నిర్వహణలోనూ కార్టిజాల్ హార్మోన్‌దే ముఖ్యపాత్ర. ఈ హార్మోన్ మోతాదు శరీరంలో బాగా పెరిగితే.. దాని పరిధిలో జరగాల్సిన పనులన్నీ గాడి తప్పుతాయి. మన కిడ్నీల ఎగువ భాగంలో రెండు చిన్న గ్రంథులు ఉంటాయి. వాటిని అడ్రినల్ గ్రంథులు అంటాం. ఇక మెదడులో పిట్యుటరీ గ్రంథి ఉంటుంది. మెదడులోని పిట్యుటరీ గ్రంథి ఎగువ భాగంలో హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. ఈ హైపోథాలమస్ అనే భాగమే మన శరీరంలోని కార్టిజాల్ హార్మోన్ల స్థాయిని నిర్ణయిస్తుంది, నియంత్రిస్తుంది.
బాధితులు వీరే..
సాధారణంగా కుషింగ్ సిండ్రోమ్ బాధితుల్లో పిల్లలు, టీనేజర్లు, యువతే ఉంటారు. బాధితుల్లో అధికులు 25 నుంచి 50 ఏళ్లలోపు వారే ఉంటారు. ప్రత్యేకించి ఈ బాధితుల్లో 70 శాతం మంది మహిళలేనట. ఏటా ప్రతీ 10 లక్షల మందిలో 40 నుంచి 70 మందిని కుషింగ్ సిండ్రోమ్ ప్రభావితం చేస్తుంటుందట.
కుషింగ్ సిండ్రోమ్‌తో ఏమవుతుంది ?
- సకాలంలో చికిత్సపొందితే పెద్దగా సమస్యలు రావు. అయితే తగిన చికిత్స లేకుంటే హైపర్‌కార్టిజాలిజం వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
- ఇన్ఫెక్షన్లు వస్తాయి.
- ఊపిరితిత్తులు, కాళ్లలో రక్తం గడ్డ కడుతుంది.
- డిప్రెషన్‌లోకి వెళ్తారు.
- గుండెపోటు సమస్య వస్తుంది.
- బరువు పెరుగుతారు. ఊబకాయం వస్తుంది.
- జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.ఏకాగ్రత ఉండదు.
- అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయి.
- ఎముకలు బలహీనపడే ముప్పు ఉంటుంది.
- టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్ సమస్యలు వస్తాయి.