Site icon HashtagU Telugu

Barefoot Walking : బేర్ ఫుట్ వాకింగ్ అంటే ఏమిటి?..అలా వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

What is barefoot walking? Do you know how many benefits you can get from walking like that?

What is barefoot walking? Do you know how many benefits you can get from walking like that?

Barefoot Walking : మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్యమో, అలాగే నిత్య వ్యాయామం చేయ‌డం కూడా అంతే అవసరం. శారీరక శ్రమ వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది వ్యాయామంగా వాకింగ్‌ను ఎంచుకుంటారు. అయితే వాకింగ్ కూడా ఎన్నో విధాలుగా ఉంటుంది. వాటిలో ‘బేర్ ఫుట్ వాకింగ్’ అనే ప్రత్యేకమైన శైలి ఇప్పుడు ఆరోగ్య నిపుణుల శిఫారసుగా నిలుస్తోంది.

బేర్ ఫుట్ వాకింగ్ అంటే ఏమిటి?

బేర్ ఫుట్ వాకింగ్ అంటే చెప్పులు లేకుండా నేరుగా నేలపై నడిచే ప్రక్రియ. దీన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని కూడా పిలుస్తారు. గడ్డి, మట్టి, ఇసుక వంటి సహజ ఉపరితలాలపై ఇలా నడవడం ద్వారా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాదాలు నేరుగా భూమిని తాకడం వ‌ల్ల భూమిలో ఉన్న సహజ విద్యుత్ శక్తి (ఎలక్ట్రాన్‌లు) మన శరీరంలోకి ప్రవేశించి, శరీరాన్ని శుభ్రం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

పాదాల ఆరోగ్యానికి మేలు

చెప్పులు, షూస్ లేకుండా నడవడం వ‌ల్ల పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వ‌ల్ల కాళ్లలోని 29 రకాల కండరాలు యాక్టివ్ అవుతాయి. కీళ్ల‌కు, ఎముకలకు, లిగమెంట్స్‌కు శక్తి లభిస్తుంది. దీని వల్ల మడమలు, మోకాళ్లు, వెన్నెముక తదితర భాగాలకు సహజమైన వ్యాయామం జరుగుతుంది. ఫలితంగా శరీరం సమతుల్యతను సాధిస్తుంది. తూలిపడే సమస్యలున్న వారు దీన్ని పాటిస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

నాడీ మండలానికి శుభ ప్రభావం

బేర్ ఫుట్ వాకింగ్ నాడీ వ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. అధ్యయనాల ప్రకారం ఇలా నడవడం వ‌ల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యలున్నవారికి ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. మెదడుకు రక్తప్రసరణ మెరుగవడం వ‌ల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. మతిమరుపు సమస్యలు తగ్గుతాయి.

శరీరంలోని వాపుల‌కి ఉపశ‌మ‌నం

భూమి నుంచి వచ్చే ఎలక్ట్రాన్‌లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించి, వాపులను తగ్గిస్తాయి. ఇది శరీరంలో నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. బేర్ ఫుట్ వాకింగ్ వ‌ల్ల శరీరం సహజ నడక పద్ధతికి అలవాటు పడుతుంది. దీని వ‌ల్ల పాదాల కదలికలు సరళంగా ఉంటాయి. పాదాల ఇన్ఫెక్షన్లను నివారించ‌చ్చు. పాదాల వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

బేర్ ఫుట్ వాకింగ్ ఎంతో ఉపయోగకరమైనదే అయినా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నడిచే ప్రదేశంలో పదునైన వస్తువులు లేకపోయేలా చూసుకోవాలి. గాజు ముక్కలు, కంచు తీరాలు లాంటి వాటి వల్ల గాయాలు కావచ్చు. అలాగే, బాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులున్న ప్రదేశాల్లో నడక నివారించాలి. కొన్ని వ్యక్తులు బేర్ ఫుట్ వాకింగ్ వల్ల అసౌకర్యంగా అనుభవించవచ్చు. అలాంటి వారు వైద్య సలహా తీసుకుని మాత్రమే దీన్ని పాటించాలి. కాగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొన్ని నిమిషాలు బేర్ ఫుట్ వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఇది శరీరానికి వ్యాయామాన్ని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ వ్యాయామ పద్ధతి శరీరాన్ని, మనసును, మెదడును ఆరోగ్యంగా ఉంచే సహజ మార్గం. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తేనే దీని లాభాలను పూర్తిగా పొంద‌గ‌ల‌ము.

Read Also: Satyapal Malik : జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కన్నుమూత

Exit mobile version