. దిగువ శరీర భాగానికి బలం, స్థిరత్వం
. వెన్నెముకకు మద్దతు, కీళ్లపై తక్కువ ఒత్తిడి
. బరువు నియంత్రణతో పాటు మానసిక ఆరోగ్యం
Wall Squats : శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి వ్యాయామం ఎంతో అవసరం. అయితే ప్రతిరోజూ జిమ్‌కు వెళ్లడం, ఖరీదైన పరికరాలు వాడడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారికి ఇంట్లోనే సులభంగా చేయదగిన వ్యాయామం వాల్ స్క్వాట్స్. వీటినే వాల్ సిట్స్ లేదా( గోడ కుర్చీ) అని కూడా పిలుస్తారు. గోడను ఆధారంగా చేసుకుని చేసే ఈ వ్యాయామం తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఫిట్‌నెస్ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, వాల్ స్క్వాట్స్ శరీర బలం, ఓర్పు, స్థిరత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వాల్ స్క్వాట్స్ ప్రధానంగా తొడల కండరాలు, గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, అలాగే కోర్ మసిల్స్‌ను బలోపేతం చేస్తాయి. ఈ వ్యాయామం వల్ల కాళ్ల బలం పెరిగి నడక, మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు నిలబడడం వంటి రోజువారీ పనులు సులభంగా మారుతాయి. ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ తగ్గే కండరాల బలాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తం. కదలకుండా చేసే వ్యాయామం కావడంతో కండరాల ఓర్పు కూడా మెరుగవుతుంది. క్రీడలు ఆడే వారికి, శారీరకంగా చురుకుగా ఉండాలనుకునే వారికి వాల్ స్క్వాట్స్ మంచి ఎంపికగా నిలుస్తున్నాయి.
నేటి జీవనశైలిలో చాలామంది నిటారుగా కూర్చోలేక, నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రభావంగా వెన్నునొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాల్ స్క్వాట్స్ చేయడం వల్ల ఉదర కండరాలు, నడుము భాగం బలపడతాయి. ఫలితంగా వెన్నెముకకు సరైన మద్దతు లభించి శరీర అమరిక మెరుగవుతుంది. కాలక్రమేణా వంగే అలవాటు తగ్గి, నిటారుతనం పెరుగుతుంది. ఇది కదలకుండా చేసే వ్యాయామం కావడంతో మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందువల్ల కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా తమ సామర్థ్యానికి అనుగుణంగా ఈ వ్యాయామాన్ని చేయవచ్చు.
వాల్ స్క్వాట్స్ శరీరంలో జీవక్రియను ఉత్తేజితం చేస్తాయి. క్యాలరీలు ఎక్కువగా ఖర్చవడం వల్ల కొవ్వు తగ్గడానికి సహాయపడతాయి. దీని ద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ కొద్దిసేపు ఈ వ్యాయామాన్ని చేయడం అలసటను తగ్గించి శరీరానికి చురుకుదనాన్ని ఇస్తుంది. అంతేకాదు, వ్యాయామం సమయంలో శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ముందుగా గోడకు ఒకటి లేదా రెండు అడుగుల దూరంలో నిలబడి, వీపును గోడకు ఆనించాలి. కాళ్లను భుజాల వెడల్పులో ఉంచి నేలపై పూర్తిగా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా గోడపై జారుతూ కిందికి దిగాలి. తొడలు నేలకి సమాంతరంగా ఉన్నప్పుడు మోకాళ్ల వద్ద సుమారు 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. ఈ స్థితిలో 20–30 సెకన్లు ఉండాలి. బలం పెరిగేకొద్దీ సమయాన్ని పెంచుతూ 3–4 సార్లు చేయాలి. ఈ వ్యాయామాన్ని రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
