Usiri Pulihora: ఉసిరి పులిహోర.. ఆ టేస్టే సూపర్.. తింటే అస్సలు వదలరంతే..

శీతాకాలంలో ఎక్కువగా దొరికే.. ఉసిరికాయ రోజుకొకటి తింటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటివి కూడా తగ్గుతాయి.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 10:07 PM IST

Usiri Pulihora: ఉసిరికాయతో చేసే వంటకాలెన్నో ఉంటాయి. ఉసిరి పచ్చడి, ఉసిరి ఊరగాయ, ఉసిరి జ్యూస్.. ఇలా రకరకాలుగా ఉసిరికాయతో వంటలు చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరికి ఉసిరితో చేసే వంటలు నచ్చవు. అలాంటి వాళ్లు ఉసిరి పులిహోరను చేసుకుని తినండి. నిమ్మకాయ పులిహోర కంటే ఇది చాలా బాగుంటుంది. మరి అలాంటి ఉసిరి పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఉసిరి పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు

వండిన అన్నం – 1.1/2 కప్పు

నూనె – 3 స్పూన్లు

పల్లీలు – గుప్పెడు

ఉసిరికాయలు – 4

పసుపు – 1/2 స్పూన్

ఎండుమిర్చి – 4

కరివేపాకు – గుప్పెడు

ఉప్పు – రుచికి సరిపడా

ఆవాలు – 1/2 స్పూను

శనగపప్పు – 1/2 స్పూన్

మినపగుళ్లు – 1/2 స్పూన్

ఉసిరి పులిహోర తయారీ విధానం

అన్నం పొడిగా ఉండేలా వండుకోవాలి. ఉసిరికాయల్లో (పెద్ద ఉసిరి) గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి.. మెత్తగా నూరి పక్కన పెట్టుకోవాలి. అన్నంలో ఉసిరి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.

కళాయి స్టవ్ పై పెట్టి.. అందులో నూనెను వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కలుపుకోవాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని ఉసిరి పేస్ట్ వేసి కలుపుకుని ఉంచిన అన్నంలో వేసి.. అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే.. టేస్టీ ఉసిరి పులిహోర రెడీ.

శీతాకాలంలో ఎక్కువగా దొరికే.. ఉసిరికాయ రోజుకొకటి తింటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జలుబు, దగ్గు వంటివి కూడా తగ్గుతాయి. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో విటమిన్ సి, ఫాస్ఫరస్, క్యాల్షియం, బి కాంప్లెక్స్, బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఉసిరికి మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఉసిరిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.