Site icon HashtagU Telugu

Watermelon: ‘పుచ్చకాయ’లో పోషకాలు పుష్కలం!

Watermelon

Watermelon

ఎండకాలం మొదలైందంటే చాలు.. సహజంగా గొంతెండుతుంటుంది. ప్రతి గంటకోసారి దాహం వేస్తుంది. ఒకవైపు భానుడు భగభగలు.. మరోవైపు ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే సమ్మర్ సీజన్ కు చెక్ పెట్టాలంటే పోషకాలు పుష్కలంగా ఉన్న పుచ్చకాయను తరచుగా తినాలి. పుచ్చకాయ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి మరి.

పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి శ‌రీరానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. శ‌రీరంలో వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.  మిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6,  పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను అందిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మహిళలు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి. గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల మలబద్దకం కూడా తగ్గుతుంది. సహజంగా గర్భిణీలు హార్ట్ బర్న్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు.

ఈ సమస్యలను నివారించడంలో పుచ్చకాయ చక్కగా సహాయపడుతుంది. పుచ్చకాయతో హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గర్భిణీల శరీరంలో సహజంగా వచ్చే కాళ్లు, పాదాలు, చేతుల వాపులను తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఈ గింజలలో ఉండే కాపర్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పుచ్చకాయ తినేటప్పుడు గింజల్ని కూడా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు లభిస్తాయి. అలాగే పుచ్చకాయలో బి, సి విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఈ పండు యొక్క గొప్పదనం ఏమిటంటే ఇది చాలా తక్కువ కేలరీలు, సోడియం తక్కువగా ఉండటం వలన దాదాపు అందరికీ సురక్షితమైన చిరుతిండి. పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, బి6, పొటాషియం  సూపర్ యాంటీ-ఆక్సిడెంట్లు లైకోపీన్ మరియు బీటా కెరోటిన్ వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే సమ్మర్ లో పుచ్చకాయను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు చాలామంది.