Teeth Tips: మీ దంతాలను స్ట్రాంగ్ చేసే టిప్స్

మీకు బలమైన దంతాలు ఉండాలంటే సరైన టూత్ (Tooth) బ్రషింగ్ చేయాలి. రోజూ పొద్దున,

మీకు బలమైన దంతాలు (Strong Teeth) ఉండాలంటే సరైన టూత్ బ్రషింగ్ చేయాలి. రోజూ పొద్దున, రాత్రి పడుకునేముందు చెరో 2 నిమిషాలు పళ్ళు (Teeth) శుభ్రంగా బ్రష్ చేయాలి. గంటలు గంటలు బ్రష్ నోట్లో పెట్టుకొని తోముతూ టైం వేస్ట్ చేయొద్దు. రోజూ ఉదయం, రాత్రి బ్రష్ చేసే వాళ్ళు మన దేశంలో ఐదు శాతం కూడా ఉండరు. విద్యావంతులు కూడా దీన్ని సరిగ్గా ఆచరించడం లేదు.

బ్రష్ నొక్కి పెట్టి బ్రషింగ్ చేస్తే?

బలంతో బ్రష్ నొక్కి పెట్టి బ్రషింగ్ చేస్తే పళ్లపై ఉండే ఎనామెల్ అనే రక్షణ పొర అరిగిపోతుంది. చిగుర్లకు గాయాలు కూడా కావొచ్చు. ఎనామెల్ అరిగిపోతే వేడి, చల్లటి, పుల్లటి వస్తువులు తీసుకున్న సమయంలో పళ్లు జివ్వున లాగుతాయి. దీన్నే “సెన్సిటివిటీ” అని చెబుతారు.

పళ్ళు (Teeth) బ్రష్ చేసే పద్ధతి ఇదీ..

  1. బ్రష్ పట్టుకుని మూడు వైపులా తిప్పేసి కడిగేసుకోవడం శుభ్రం చేసుకున్నట్టు కాదు. ప్రతీ దంతం ఉపరితలంపై తిష్ట వేసిన బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోవాలి.
  2. నామమాత్రంగా, ఓ టెక్నిక్ లేకుండా బ్రష్ చేసుకుంటే బ్యాక్టీరియా నోటిలోనే ఉండిపోతుంది. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జింజివైటిస్, పెరియోడాంటిస్ (చిగుళ్లు వాచిపోయి పళ్లకు, చిగుళ్లకు మధ్య గ్యాప్ పెరిగి పోవడం)కు కారణమవుతుంది.
  3. పళ్ల మొదట్లో గారలా పేరుకుపోయే దాన్ని ప్లాక్యూ అంటారు. పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఇదే. ఆహారం తీసుకున్న తర్వాత పళ్లపై ప్లాక్యూ ఏర్పడడానికి 4 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అందుకే రోజులో రెండు సార్లు 12 గంటలకోసారి బ్రష్ చేసుకోవాలనేది.
  4. బ్రష్ ను 45 డిగ్రీల కోణంలో ఉంచి పట్టుకోవాలి. నోటి లోపల దవడ పళ్లకు బయటి భాగంలో బ్రష్ ను ఉంచి కింది వైపు నుంచి పై వైపునకు వచ్చేలా బ్రష్ చేయాలి. లోపలి వైపు నుంచి చేసే సమయంలోనూ ఇంతే.
  5. చిగుళ్ల నుంచి కొసర్లకు వచ్చేలా చేయాలి. అంతే కానీ, పైకీ కిందకీ రెండు దిశల్లోనూ బ్రష్ ను తిప్పరాదు.  ప్రతీ దంతంపై ఇదే మాదిరిగా చేయాలి. ప్రతీ దంతం ముందు భాగంలోనే కాదు, వెనుక భాగంలోనూ ఇదే మాదిరి (టెక్నిక్)గా శుభ్రం చేసుకోవాలి.
  6. ప్రతీ దంతం ఉపరితలంలో (చిగురుతో అనుసంధానమై ఉన్న చోట) బ్రష్ చేయాలి. అంటే ప్రతీ పన్ను ముందు, వెనుక, మొదట్లో, చివరి భాగంలో బ్రష్ చేసుకోవడం తప్పనిసరి.
  7. నాలుకను కూడా ఓ సారి బ్రష్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నాలుకపైనే ఎక్కువగా ఉంటుంది. బ్రష్ చేయడం వల్ల అది తొలగిపోతుంది.
  8. చిగుర్లను క్లీన్ చేయడం తప్పనిసరి. దంతాలు చర్మంతో అనుసంధానమయ్యే చోటే బ్యాక్టీరియా నిల్వ ఉండే స్థావరం. సాధారణంగా బ్రష్ చేసే సమయంలో బ్రష్ బ్రిస్టల్స్ ఈ ప్రాంతంలోకి వెళ్లవు. ప్రత్యేకంగా మనమే శ్రద్ధతో ఓపికతో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి బ్రష్ వాడాలి?

టూత్ బ్రష్ హార్డ్ గా ఉండరాదు. నోటిలోపల పళ్ల వరుస మూల వరకూ వెళ్లే విధంగా డిజైన్ ఉండాలి. సాఫ్ట్ బ్రిస్టల్స్ (సున్నితమైన పళ్లు) ఉన్న బ్రష్ వాడుకోవాలి. హార్డ్ బ్రష్ అయితే పళ్లను మరింత సమర్థవంతంగా శుభ్రం చేస్తుందనుకుంటారు. కానీ ఇది సరికాదు. సాఫ్ట్ బ్రిస్టల్స్ కూడా ఎఫెక్టివ్ గా దంతాలను శుభ్రం చేస్తాయన్నది వైద్యులు చెప్పే మాట. బ్రిస్టల్స్ రంగు మారినా.. వంగిపోయినా.. బ్రష్ వాడకం మొదలు పెట్టి మూడు నెలలు దాటిపోయినా బ్రష్ మార్చడం మంచిది.

పిల్లలకు బ్రషింగ్..

రెండేళ్ళ వయస్సు దాటిన పిల్లలతో బ్రషింగ్ చేయించాలి. పిడియాట్రిక్ టూత్ పేస్టుతోనే పిల్లల పళ్లను శుభ్రం చేయాలి. పెద్దలకు దంతాల శుభ్రత ఎంత ముఖ్యమో పిల్లలకూ అంతే ముఖ్యం.

భోజనం చేసిన వెంటనే బ్రషింగ్ వద్దు

చాలామంది అన్నం తిన్న వెంటనే దంతాలను శుభ్రపరుచుకుంటారు. నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, నోటిలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుంది. అలాంటిది ఆహారం తిన్న వెంటనే పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గిపోతుంది. అందుకని భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి బ్రష్ చేసుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.

దంతాలు (Teeth) సేఫ్ గా ఉండాలంటే ఈ అలవాట్లు వదలండి..

  1. దంతాలను క్లీన్ గా ఉంచుకుంటే ఎన్నో రోగాలు దరిచేరవు.
  2. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించాలి.
  3. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోకూడదు.
  4. సోడాలు, షుగరీ డ్రింగ్స్, ఆల్కహాల్, ధూమపానంతో మీ దంతాలపై ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది.
  5. పళ్ల రసాలు మంచివని ఎక్కువగా తాగితే మీ పళ్లు త్వరగా పటుత్వం కోల్పోయి ఊడతాయి. అందుకే చక్కెర వేసిన ఇలాంటి జ్యూసులను తగ్గించి, పళ్లను తినండి. ఒకవేళ పళ్ల జ్యూసులు తాగాల్సి వస్తే చక్కెర వేయకుండా తాగండి.
  6. ఐస్ ఎక్కువ వేసిన జ్యాసులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ తాగటం, చాలా వేడిగా ఉన్న టీ, కాఫీలు అతిగా తాగటంతో కూడా ఎనామిల్ సమస్యలు వస్తాయి.
  7. ఈ చిన్న విషయాలపై జాగ్రత్త వహిస్తే మీకు పంటి సమస్యలు తగ్గుతాయి.

Also Read:  Pathan @ ₹1000 Crore Club: రూ.1000 కోట్ల క్లబ్ కు చేరువైన ‘పఠాన్’