Husband Qualities: మంచి భర్త అనిపించుకోవాలంటే…ఈ లక్షణాలు ఉండాల్సిందే..!!

దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 01:38 PM IST

దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఒకరి కోసం మరొకరు అనేలా ఉంటే…దంపతులిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఎదుటివారి అభిప్రాయాలకు విలువనివ్వాలి. వారిని గౌరవిస్తేనే భేదాభిప్రాయాలు రావు. భార్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే ఆరాటానికి బదులుగా నిజాయితీగా ఉంటడమే మంచిదంటున్నారు మనస్తత్వ నిపుణులు. దాంపత్య జీవితంలో భార్యకు అన్ని అంశాల్లోనూ భరోసాను కల్పించాలి. కుటుంబానికి తోడు నీడగా ఉండాలి. అప్పుడే సమాజం నుంచి మగళ్లాకు ప్రశంసలు దక్కుతాయి. ఈ లక్షణాలను భర్తలు అందిపుచ్చుకోవడం చాలా అవసరం.

మంచి భర్తగా ఉండాలంటే….ఈ విషయాలపై దృష్టి పెట్టాలి.

1. భార్యను ప్రేమించాలి:
రోజువారీ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల్లో పడి కొంతమంది మగాళ్లు భార్యకు సమయం కేటాయించరు. అలాంటప్పుడే వారు అసంతృప్తికి లోనవుతారు. ఒక వ్యక్తి కోరికలు, అవసరాలనేవి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కానీ వాటి కోసం జీవిత భాగస్వామిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అందుకే భార్యను ప్రేమించాలి. దీని కోసం మీరు ఎలాంటి అంశాలు మార్చుకోవాలో వాటిపైన్నే దృష్టి పెట్టాలి. భార్యకు ఇంటి పనుల్లో సహాయం చేయాలి. సమయానికి తింటున్నారా…లేదా..అనేది ఆరా తీయాలి. మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి ప్రయత్నించాలి.

2. ముద్దులు కూడా ముఖ్యమే:
ఎదుటివారిపై ప్రేమ, ఆప్యాయతలు ముద్దుల రూపంలో వెల్లడవుతాయి. కానీ ముద్దు పెట్టుకోవడం కేవలం యాంత్రికంగా ఉండొద్దు. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేముందు భార్యకు ప్రేమతో ఇచ్చే ముద్దు…వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. మీ జీవిత భాగస్వామికి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండేలా చూసుకోండి.

3. గత మధురానుభూతులు గుర్తు చేయాలి:
భర్తకు కుటుంబ బాధ్యతలు…భార్యకు ఇంటి పనులతోనే రోజంతా గడిచిపోతుంది. కొన్నిసార్లు ఒకరితో మరొకరు ప్రేమగా మాట్లాడుకునే సమయం కూడా దొరకదు. అలాంటప్పుడు భర్తలు కాస్త సమయం కేటాయించాలి. సమయం దొరికినప్పుడల్లా భార్యతో మాట్లాడాలి. మీ జీవిత భాగస్వామిని మొదటిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు…మొదటి ముద్దు, ఫస్ట్ డేట్…వంటి రొమాంటిక్ డిస్కషన్ చేస్తుండాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఇద్దరిమధ్య బంధం మరింత బలపడేలా చేస్తుంది.

4. ప్రేమగా మాట్లాడాలి:
ప్రేమను అనుభూతి చెందే భాషలో భాగస్వామితో మాట్లాడాలి. ప్రేమభాష గురించి తెలుసుకోవడం, జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడటం వల్ల ఎంతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. భార్యతో మాట్లాడేటప్పుడు కొన్ని నిశ్చితమైన పదాలు, ముద్దుపేర్లు వాడాలి. కౌగిలింతలు వంటి శారీరక స్పర్శ కూడా ఉండాలి. వారితో సేవాభావంతో మెలుగుతూ..భార్యలకు నాణ్యమైన సమయం కేటాయించాలి. తరచుగా బహుమతులు ఇస్తుండాలి. వీటన్నింటి ద్వారా జీవితభాగస్వామిపై ప్రేమను వ్యక్తపరచవచ్చు.

5. క్షమాపణలు చెప్పాలి:
ప్రేమకు భాష ఎలాగుంటుందో…క్షమాపణలకు కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. సంసారంలో కోపతాపాలు మామూలే. భాగస్వామిపై కోప్పడినప్పుడు…వారికి నిర్దిష్టమైన పద్దుతుల్లో క్షమాపణ చెబుతుండాలి. అది ఆలుమగల మధ్య ఏర్పడే గ్యాప్ ను క్షణాల్లో దూరం చేస్తుంది. జీవిత భాగస్వామికి ఎలా క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారం అవుతుందో భర్తలు తెలుసుకోవాలి.

6. తప్పులకు బాధ్యత వహించాలి:
కొంతమంది భర్తలు ప్రతి విషయంలోనూ భార్యనే తప్పుబడుతుంటారు. అది సబబు కాదు. కొన్ని సార్లు భర్తలు కూడా సమస్యను క్రియేట్ చేస్తారు. గొడవకు కారణం అవుతుంటారు. అలాంటి సమయాల్లో తప్పును ఒప్పుకోవడానికి వెనకాడకూడదు. మీ ప్రవర్తనకు పూర్తి బాధ్యత తీసుకోవడం అనేది సంసారంలో చాలా ముఖ్యం. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణుగుతాయి.

7. ఎక్కవగా ఊహించుకోవద్దు:
మీ భాగస్వామికి సంబంధించి అన్ని విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు. కానీ వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారన్న విషయం కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకూడదు. అతిగా ఊహించుకోవడం వల్ల సమస్యలకు కారణం అవుతాయి. ఇద్దరి మధ్య గొడవలకు దారితీస్తాయి. అందుకే చిన్నపాటి గ్యాప్ వచ్చినా సరే…వెంటనే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

8. మొండితనం వద్దు:
సంసారం సజావుగా సాగిపోవాలంటే…భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు క్షమించుకునే గుణం అలవాటు చేసుకోవడం మంచిది. మొండితనం, పట్టుదలను దూరం చేసుకోవాలి. ఈ రెండింటినీ మగవాళ్లు అర్ధం చేసుకున్నప్పుడు దాంపత్యంలో ఆనంతం ఉంటుంది. భాగస్వామి చిన్న విషయాలను కూడా క్షమించలేకపోతే…అది అసంపూర్ణతకు దారి తీస్తుంది.

9. కనీస విలువనివ్వాలి:
కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ భార్య అభిప్రాయాలను తీసుకుంటుండాలి. వ్యక్తిగత లక్ష్యాు…ఇంటి బాధ్యతలు…ఆర్థిక అవసరాలు..పేరెంటింగ్…వంటి అంశాల గురించి చర్చిస్తున్నప్పుడు జీవిత భాగస్వామికి ఎక్కువ విలువనివ్వాలి. ఇలాంటి విషయాల్లో అనవసర వాదనలకు పోకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి భార్య మద్దతు ఉందనే భరోసా మీ విజయానికి కారణం అవుతుంది.

10. జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి:
రోజంతా భార్య కొంగుపట్టుకుని తిరాగాల్సిన పనిలేదు. ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలైనా ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునేందుకు సమయం కేటాయించుకోవాలి. దీంతో ఇద్దరికీ మానసిక ప్రశాంతత దొరుకుతుంది. భార్యలకు ఇంటి పనులు, భర్తలు ఆఫీసు పనుల వల్ల ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేస్తూ రిఫ్రెష్ అయ్యేందుకు ఇది మంచి మార్గం. ఒకరినొకరు మిస్ కావాడంలేదన్న భరోసా కల్పించుకుంటే…మరింత ప్రేమానుభూతి చెందుతారు.