Site icon HashtagU Telugu

Gold Rates: రేటు పెరిగిన బంగారం.. వాడకం తగ్గించిన జనాలు

Whatsapp Image 2023 01 31 At 21.33.39

Whatsapp Image 2023 01 31 At 21.33.39

Gold Rates: మన దేశంలో బంగారానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కొంతమంది బంగారాన్ని తమ హోదాకు చిహ్నంగా భావిస్తే, మరికొందరు అత్యవసర సమయాల్లో పనికి వచ్చే వస్తువుగా చూస్తారు. ఇక శుభకార్యాలు జరుగుతున్నాయంటే చాలు ముందు బంగారం దుకాణానికే వెళుతుంటారు. ఇలా భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉండటం తెలిసిందే. అయితే తాజాగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధర అంతకంతకు కొండెక్కుతోంది. కొన్నాళ్ల క్రితం 50వేల చుట్టుపక్కల ఉన్న బంగారం ధర ఇప్పుడు ఏకంగా 60వేల రూపాయలకు చేరువలో ఉంది. దీంతో జనాలు బంగారం వినియోగాన్ని తగ్గించేశారు. ప్రపంచ స్వర్ణ మండలి ప్రకారం 2022తో పోలిస్తే 3శాతం బంగారం వినియోగం తగ్గింది.

ప్రపంచ స్వర్ణ మండలి (WGC) ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడమే కారణం అని తెలుస్తోంది. అయితే బంగారం రేటు పెరగడం, దాని వల్ల వినియోగం తగ్గడం వల్ల మేలే కలుగుతోందని ప్రపంచ స్వర్ణ మండలి అభిప్రాయపడింది. దీని వల్ల వాణిజ్య లోటు తగ్గించడానికి, రూపాయి విలువ పతనం అడ్డుకోవడానికి దోహదం అయినట్లు వివరించింది. 2022లో 774 టన్నుల వినియోగించగా.. ఒక్క డిసెంబర్ లోనే 20శాతం తగ్గినట్లు తెలిపింది.

కాగా 2023 మార్చి త్రైమాసికంలో పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చేతికి అందడం, శుభకార్యాలు ఉండమే దీనికి కారణంగా చెబుతోంది. కాకపోతే మూడింట రెండు వంతుల బంగారం డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్న నేపథ్యంలో ఈ త్రైమాసికంలో వినియోగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంగారం ధర పెరిగిన నేపథ్యంలో కొంతమంది బంగారం ఉన్న వాళ్లు దానిని అమ్మగా, మరికొందరు పాతది అమ్మి, కొత్తది కొన్నారని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది.