. ఒత్తిడి వల్ల శరీరంపై ప్రభావాలు
. వ్యాయామం, ఎండార్ఫిన్ హార్మోన్ ప్రాధాన్యం
. ఒత్తిడి తగ్గించే యోగాసనాలు
Yoga : మారుతున్న జీవన విధానం మన జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చినప్పటికీ, అదే సమయంలో మానసిక సమస్యలను కూడా పెంచుతోంది. ముఖ్యంగా ఒత్తిడి (స్ట్రెస్) నేటి మనిషి జీవితంలో విడదీయలేని అంశంగా మారింది. పని ఒత్తిడి, చదువు భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై అనిశ్చితి వంటి కారణాలతో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే మానసిక ప్రశాంతతనే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. దీని ప్రభావంతో గుండె స్పందన వేగం పెరగడం, రక్తపోటు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే దీర్ఘకాల ఒత్తిడితో బాధపడేవారిలో తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. మానసిక అలసట, ఆందోళన, ఏకాగ్రత లోపం కూడా సాధారణంగా కనిపిస్తున్న లక్షణాలే. అందుకే ఒత్తిడిని నియంత్రించడం ఆరోగ్యానికి అత్యంత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు శారీరక వ్యాయామం ఒక మంచి మార్గం. నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ‘ఎండార్ఫిన్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మనసుకు ఆనందం, ప్రశాంతతను అందిస్తుంది. ఆందోళనను తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు నియంత్రణలో, నిద్ర నాణ్యత మెరుగుపడటంలో కూడా ఎండార్ఫిన్ సహాయపడుతుంది. వ్యాయామంతో పాటు యోగా, ధ్యానం, ప్రాణాయామాలు చేయడం వల్ల శరీరం–మనసు రెండింటికీ మేలు జరుగుతుంది.
యోగ నిపుణుల ప్రకారం కొన్ని ప్రత్యేక ఆసనాలు ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. గరుడాసనం చేయడం వల్ల శరీర సమన్వయం పెరుగుతుంది. చేతులు, కాళ్లను మెలితిప్పి నిలబడే ఈ ఆసనం మెదడును ఉత్తేజితం చేసి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. బాలాసనం నాడీవ్యవస్థకు ప్రశాంతతను ఇస్తుంది. ముందుకు వంగి నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఆందోళన, భావోద్వేగ ఒత్తిడి తగ్గుతాయి. పద్మాసనం మనసుకు స్థిరత్వాన్ని అందిస్తుంది. దీని వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరిగి ఏకాగ్రత మెరుగవుతుంది. ఉత్తానాసనం మెడ, భుజాలు, వెన్నుపూసలోని ఉద్రిక్తతను తగ్గిస్తుంది. మెదడుకు రక్తప్రసరణ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. వజ్రాసనం భావోద్వేగ నియంత్రణకు ఉపకరిస్తుంది. శరీరాన్ని స్థిరంగా ఉంచి మనసును నిశ్చలంగా మారుస్తుంది. ఇవన్నీ నిత్యం కొద్దిసేపు చేస్తే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పని మీద దృష్టి పెరిగి, మొత్తం శరీర ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
