ఈ రోజుల్లో కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు (Hair) సంబంధిత సమస్యలు విపరీతం అవుతున్నాయి. చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం, తెల్లజుట్టు రావడం, పొడిబారడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని నివారించడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే ఖరీదైన షాంపూలు, ఆయిల్స్, కండిషనర్లను ఉపయోగిస్తున్నా, ఎటువంటి ప్రయోజనం లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. అయితే సహజమైన మార్గాల ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వాటిలో చింతపండు (Tamarind ) ఒక ముఖ్యమైన ఉపాయంగా నిలుస్తుంది. చింతపండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును పోషిస్తూ, అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
జుట్టు రాలడం, పొడిబారడం తగ్గించడంలో చింతపండు కీలక పాత్ర
చింతపండులో అధికంగా ఉండే విటమిన్ C తల చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చింతపండు నీటిని తల మీద రాస్తే, చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. అదే విధంగా, పొడి జుట్టు సమస్య ఉన్నవారు చింతపండు నీటిని అలోవెరా జెల్‌తో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగిస్తే, జుట్టు మృదువుగా మారుతుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణం కూడా చింతపండుకు ఉండటంతో, ఇది జుట్టు పెరుగుదలకు బలమైన సహాయకారి.
తెల్లజుట్టు సమస్యకు చింతపండు చాల బెటర్
ఇప్పటి తరం చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతోంది. అలాంటి వారికి చింతపండు మంచి పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. చింతపండు నీటిని హెన్నాతో కలిపి జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టు నల్లగా మారటమే కాకుండా, దీర్ఘకాలంగా నల్లగా ఉండేలా సహాయపడుతుంది. అలాగే, చింతపండు నీటిని తలపై మసాజ్ చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడాన్ని అరికట్టవచ్చు. అతి తేలికైన ఈ సహజ చికిత్సను క్రమం తప్పకుండా అమలు చేస్తే, జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.