Mango Sambar : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ సాంబార్.. ఎలా చేయాలో తెలుసా?

మామిడికాయ పచ్చడి అయితే ప్రతి ఇంట్లో పెట్టాల్సిందే. దీనితో మనం పచ్చడి, సాంబార్, పప్పు, రసం.. ఇలా రకరకాలు వండుకుంటూ ఉంటాము. అయితే మామిడికాయతో సాంబార్(Mango Sambar) చాలా రుచిగా తయారుచేసుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Mango Sambar how to prepare

Mango Sambar how to prepare

ఎండాకాలం(Summer)లో మాత్రమే మనకు మామిడికాయ విరివిగా లభిస్తుంది. మామిడికాయ పచ్చడి అయితే ప్రతి ఇంట్లో పెట్టాల్సిందే. దీనితో మనం పచ్చడి, సాంబార్, పప్పు, రసం.. ఇలా రకరకాలు వండుకుంటూ ఉంటాము. అయితే మామిడికాయతో సాంబార్(Mango Sambar) చాలా రుచిగా తయారుచేసుకోవచ్చు.

మామిడికాయ సాంబార్ కి కావలసిన పదార్థాలు:-
* కందిపప్పు ఒక కప్పు
* సాంబార్ మసాలా పొడి
* ధనియాల పొడి కొద్దిగా
* కారం ఒక స్పూన్
* తాలింపు గింజలు రెండు స్పూన్లు
* ఎండు మిర్చి మూడు
* కరివేపాకు కొద్దిగా
* దోసకాయ ఒకటి
* సొరకాయ ఒకటి చిన్నది
* ఉల్లిపాయలు 5 చిన్నవి
* టమాటో ఒకటి
* వెల్లుల్లి పాయలు నాలుగు
* కొత్తిమీర తురుము కొద్దిగా
* ఉప్పు సరిపడ
* చింతపండు కొద్దిగా
* నూనె తగినంత

ఉల్లిపాయలు, సొరకాయ, టమాటో, మామిడికాయ, దోసకాయ ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి. కందిపప్పును నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి. చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. కందిపప్పును కొన్ని టమాటా, ఉల్లిపాయ, దోసకాయ, సొరకాయ ముక్కలను కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి తాలింపు పెట్టి ఎండుమిర్చి వేగిన తరువాత మామిడికాయ ముక్కలు అన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత చింతపండు పులుసును పోయాలి. ముక్కలు అన్నీ ఉడికిన తరువాత కుక్కర్ లో ఉడికించి పెట్టుకున్న పప్పును, కూరగాయలను దాంట్లో వేసి దానికి కొద్దిగా ఉప్పు, కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి కలిపి మెత్తగా అయ్యేలా కలపాలి. తరువాత సరిపడ నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అనంతరం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే సాంబార్ ఉడికేటప్పుడే ఓ బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. దీంతో మామిడికాయ సాంబార్ రెడీ అయినట్లే. పుల్లపుల్లగా, బెల్లం వేసుకుంటే కొంచెం తియ్యగా చాలా బాగుంటుంది.

  Last Updated: 28 May 2023, 09:45 PM IST