Exercise: అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏ ఏ సమయాల్లో ఎక్సర్ సైజ్ లు చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది?

ఉదయాన్నే వ్యాయామం చేసేస్తే ఓ పనైపోద్ది.. ఇక రోజంతా పనులు చూసుకోవచ్చు అనుకునేవారే ఎక్కువ.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 06:30 AM IST

ఉదయాన్నే వ్యాయామం చేసేస్తే ఓ పనైపోద్ది.. ఇక రోజంతా పనులు చూసుకోవచ్చు అనుకునేవారే ఎక్కువ. ఒకవేళ ఇంటిపనులు, ఆఫీసు పనులతో అవ్వనివారు వారికి కుదిరిన సమయాల్లో ఎక్సర్ సైజులు చేస్తుంటారు. కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామాన్ని చేయకూడదని.. పురుషులు, మహిళలు వేరు వేరు సమయాల్లో వీటిని చేయడం వల్ల వేరు వేరు ఫలితాలు ఉంటాయంటున్నారు స్కిడ్ మోర్ కాలేజ్ కు చెందిన నిపుణులు.

మగవారు ఉదయం పూట ఎక్కువగా వ్యాయామం చేస్తారు. కానీ అలా కాకుండా సాయంత్రం పూట ఎక్సర్ సైజులు చేయడం వల్ల బీపీ, గుండె సంబంధ వ్యాధులు, కొవ్వు పెరగడం, అలసిపోవడం వంటివి తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. అంటే సాయంత్రం వేళ వ్యాయామం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు ఆరోగ్యపరంగా మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుందని అర్థమవుతోంది.

ఇక మహిళలు అయితే వ్యాయామాన్ని ఒక్కో సమయంలో చేయడం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది. ఉదయం పూట చేస్తే.. పొట్ట తగ్గుతుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. అదే సాయంత్రం పూట చేస్తే.. గుండె కండరాలు మరింత పటిష్టంగా తయారవుతాయి. దీంతోపాటు తిన్న పోషకాలను శరీరం కూడా బాగా గ్రహించుకుంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నాలుగైదు గంటల సమయంలో ఇలా ఎక్సర్ సైజులు చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా మహిళలు ఇంకా ఫిట్ గా ఉంటారు అంటున్నారు నిపుణులు.

ఈ పరిశోధన కోసం 27 మంది స్త్రీలు, 20 మంది పురుషులను ఎంపిక చేశారు. వారితో 12 వారాల పాటు వేరువేరు సమయాల్లో వ్యాయామాన్ని చేయించారు. ఆ వచ్చిన ఫలితాలే ఇవి.