Site icon HashtagU Telugu

Palakura Uthappam Recipe : హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. పాలకూర ఊతప్పం రెసిపీ

Palak Uthappa Recipe

Palak Uthappa Recipe

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిలో పాలకూర కూడా ఒకటి. పాలకూరను ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు, పోషకాహార నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. పాలకూర రుచి కాస్త పచ్చిగా ఉంటుంది కాబట్టి ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు. పప్పు వంటి వాటిలో అయితే అలా వాసన రాదు.

పాలకూరతో పచ్చివాసన రాకుండా పిల్లల కోసం చాలా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ కూడా చేయొచ్చు. చూడ్డానికి గ్రీన్ కలర్ లో ఉంటుంది కాబట్టి.. పిల్లలు కూడా తినడానికి ఆసక్తి చూపుతారు. అదే పాలకూర ఊతప్పం. దీనిని ఎలా చేయాలో, అందుకు ఏవేం కావాలో తెలుసుకుందాం.

పాలకూర ఊతప్పం రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర – 3 కట్టలు

బియ్యం – 3 కప్పులు

మినపప్పు – 1 కప్పు

టమాటో ప్యూరీ – 1 కప్పు

ఉల్లిపాయ – 1

క్యాప్సికం – 1

మిరియాలపొడి – 1/4 స్పూన్

ఉప్పు – రుచికి కావలసినంత

కారం – 1/2 స్పూన్

చీజ్ – 1/2 కప్పు

పాలకూర ఊతప్పం తయారీ విధానం

నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం, మినపప్పులను రుబ్బుకుని, ఆ పిండిలో ఉప్పును కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి పులిసిన పిండిన మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరను శుభ్రంగా కరిగి చిన్న తరగాలి. దీనిని ఒక కళాయిలో కాస్త నూనె వేసి.. పచ్చివాసన పోయేంతవరకూ మగ్గించుకోవాలి.

ఇప్పుడు మగ్గబెట్టుకున్న పాలకూరను మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుని.. రుబ్బుకున్న పిండిలో కలుపుకోవాలి. టమాటాలను కూడా ప్యూరీలా చేసి కలపాలి. స్టవ్ పై పెనం పెట్టి.. అది వేడయ్యాక ఊతప్పంలా వేసుకోవాలి. పైన తరిగిన క్యాప్సికం, చీజ్ వేసుకోవాలి. దానిని రెండువైపులా కాల్చుకోవాలి. అంతే పాలకూర ఊతప్పం రెడీ. దీనిని కొబ్బరితో చేసిన చట్నీతో తింటే.. చాలా బాగుంటుంది.