Palak Biryani : పాలకూరతో బిర్యానీ.. ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Palak Biryani : వారానికి ఒక్కసారైనా పాలకూర తింటే.. ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పినా.. రుచి నచ్చక తినేవారు తగ్గిపోయారు. అలాంటివారు పాలక్ బిర్యానీని ట్రై చేయండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 03:14 PM IST

Palak Biryani : పాలకూర.. దీనిని మామూలుగా కూరవండుకుని తినాలన్నా, పప్పులో కలిపి తినాలన్నా చాలా మందికి నచ్చదు. పాలకూరను తినడానికి అస్సలు ఇష్టపడనివారు చాలామంది ఉన్నారు. వారానికి ఒక్కసారైనా పాలకూర తింటే.. ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్పినా.. రుచి నచ్చక తినేవారు తగ్గిపోయారు. అలాంటివారు పాలక్ బిర్యానీని ట్రై చేయండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. మరి ఆ పాలక్ బిర్యానీని ఎలా తయారు చేయాలో, అందుకు ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.

పాలక్ బిర్యానీకి కావలసిన పదార్థాలు..

పాలకూర – 2 కట్టలు

అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

బాస్మతి బియ్యం – 2 కప్పులు

నెయ్యి – 2 స్పూన్లు

యాలకులు – 4

బిర్యానీ ఆకు – 2

కారం – 1 స్పూన్

దాల్చిన చెక్క – చిన్నముక్క

పసుపు – అర స్పూన్

పుదీనా – 1 కట్ట

నీరు – తగినంత

లవంగాలు – 4

జాపత్రి – 2 ముక్కలు

గరంమసాలా పొడి – 1 స్పూన్

జీలకర్ర పొడి – 1 స్పూన్

ధనియాల పొడి – 1 స్పూన్

కొత్తిమీర తరుగు – 4 స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

పాలక్ బిర్యానీ తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి 80 శాతం ఉడికించుకోవాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను శుభ్రంగా కడిగి.. సన్నగా తరుగుకోవాలి. మిక్సీ జార్ లో పాలకూర, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేసి.. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జాపత్రి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత.. గరంమసాలా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్టును వేసి వేయించాలి.

మంటను చిన్న పెట్టి.. ఉడకనివ్వాలి. పాలకూర బాగా ఉడికి నూనె పైకి తేలుతుండగా.. ముందుగా వండుకుని పెట్టుకున్న అన్నంను ఇందులో కలపి.. పైన కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి, 10 నిమిషాలు సన్నటి సెగమీద ఉడికించాలి. అంతే.. వేడివేడి పాలక్ బిర్యానీ రెడీ.

పాలకూరలో స్కిన్ క్యాన్సర్ నుంచి రక్షించే పోషకాలు ఉంటాయి. హైబీపీ ఉన్నవారికి పాలకూర చాలా మంచిది. విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాలను కాపాడుతుంది. ఒత్తిడి పెరగకుండా అడ్డుకుని.. అధిక రక్తపోటును నిరోధిస్తుంది. కంటిచూపును కూడా మెరుగ్గా ఉంచుతుంది.