Site icon HashtagU Telugu

Sankranti Kites Festival: సంక్రాంతికే గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తారు ? మీకు తెలుసా

sankranti kites festival

sankranti kites festival

Sankranti Kites Festival: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట ఇంటికొచ్చే సమయానికి సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త ధాన్యంతో పొంగళ్లు వండి.. శ్రేయస్సుకు ప్రతీకగా పండుగను జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వచ్చేదానినే మకర సంక్రమణం.. మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. ఎద్దులకు స్నానాలు చేయించి.. వాటిని దైవంగా భావించి పూజిస్తారు. ఇంటి తలుపులను పైరుతో, చెరకుగడలతో అలంకరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సంక్రాంతి అంటే కోడిపందేలు, ఎడ్లపందాలు కూడా గుర్తొస్తాయి. కొన్ని ప్రాంతాల్లో రన్నింగ్ కాంపిటిషన్, రెజ్లింగ్ లతో పాటు.. గాలిపటాలను ఎగురవేసే ఆచారాలూ ఉంటాయి. అయితే ఇలా గాలిపటాలను ఎగురవేయడానికి గల కారణమేంటో తెలుసుకోవాలని మీకెప్పుడైనా అనిపించిందా ?

సంక్రాంతికి రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురవేయడంలో ఉండే మజానే వేరు. గాలిపటాలు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. సంక్రాంతి సమయంలో ఎగురవేసే గాలిపటాలకు ప్రత్యేకత ఉంది. సాధారణంగా శీతాకాలంలో క్రిములు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటివల్ల జబ్బులు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర సంక్రాంతి సమయంలో సూర్యకిరణాలను పొందడం ద్వారా బ్యాక్టీరియా సహజంగా నాశనమవుతుంది. గాలిపటాలను ఎగురవేసేందుకు ఎండలో ఉంటారు కాబట్టి.. సూర్యకిరణాలు నేరుగా మన శరీరంపై పడి.. రోగాలను దగ్గరకు రాకుండా చేస్తాయి. సంక్రాంతికి గాలిపటాలను ఎగురవేయడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే.

సంక్రాంతి గాలిపటాలను ఎగురవేయడం వెనుక మరోకథ కూడా ప్రచారంలో ఉంది. మకర సంక్రాంతి, ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగురవేస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మకం. మంచి జీవితాన్ని, సంతోషాన్నిచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ గాలిపటాలను ఎగురవేస్తారట.