Site icon HashtagU Telugu

Rayalaseema Tomato Pappu : రాయలసీమ స్పెషల్.. పచ్చిమిర్చి టమాటా పప్పు..

pachimirchi tomato pappu

pachimirchi tomato pappu

Pachimirchi Tomato Pappu : అందరూ ఇష్టపడి తినే వంటకాల్లో టమాటా పప్పు ఒకటి. అన్నం, రోటీ, చపాతీల్లోకి సూపర్ గా ఉంటుంది. టమాటా పప్పు అంటే.. మామూలుగా తినే దానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు. అయితే.. రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి టమాటా పప్పు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ? చేయకపోతే ఇప్పుడు చేయండి. వంటరానివాళ్లు కూడా.. ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకు ఏయే పదార్థాలు కావాలి ? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

పచ్చిమిర్చి టమాటా పప్పు తయారీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు – 1/2 కప్పు
నీళ్లు – 1.1/2
పచ్చిమిర్చి – 10
ఉల్లిపాయ – తరిగినది 1
టమాటాలు – 3
పసుపు- 1/2 టీ స్పూన్
ధనియాల పొడి – 1/2 టీ స్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
కొత్తిమీర – తరిగినది కొద్దిగా
చింతపండు – కొద్దిగా
ఉప్పు – తగినంత

తాలింపుకు.. నూనె – 2 టేబుల్ స్పూన్లు
తాలింపు దినుసులు – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 3
దంచిన వెల్లుల్లి రెమ్మలు – 6
నిలువుగా తరిగిన ఉల్లిపాయ – 1
కరివేపాకు – 1 రెమ్మ

పచ్చిమిర్చి టమాటా పప్పు తయారీ విధానం

శుభ్రంగా కడిగిన కందిపప్పును కుక్కర్లో వేసి.. నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటాలు, పసుపు, ధనియా పొడి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు వేసి.. మూత ఉంచి మీడియం ఫ్లేమ్ లో మంటపెట్టి 4-5 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఆవిరిపోయాక.. మూతను తీసి ఉప్పు వేసి కలుపుకోవాలి. పప్పును మెత్తగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి.

కళాయిలో నూనె వేసి వేడయ్యాక.. తాలింపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అన్ని వేగాక పప్పును అందులో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్ పచ్చిమిర్చి టమాటా పప్పు రెడీ. రొట్టెలు, చపాతీ, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే.. నెక్ట్స్ లెవల్ అంతే.

Also Read : Drinking Soda : వేసవిలో సోడాలను ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..