ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డ కట్టడం అన్నది మనందరం చూసే ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మొత్తం అంతా గడ్డకట్టుకుపోయి చాలా గట్టిగా మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్నగా పొగలు కూడా వస్తూ ఉంటాయి. కాగా ఫ్రీజర్‌లో ఐస్ ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. తలుపు తరచూ తెరవడం లేదా సరిగా మూయకపోవడం వల్ల వాతావరణంలోని తేమ లోపలికి చేరి ఐస్ లా మారుతుంది. ఫ్రీజర్ లో వేడి ఆహార పదార్థాలను నిల్వ చేయడం కూడా తేమను పెంచి ఐస్ ఏర్పడటానికి దారితీస్తుందట.
డోర్ సీల్ దెబ్బతినడం లేదా ఫ్రీజర్ టెంపరేచర్ సెట్టింగ్ సరిగా లేకపోవడం కూడా ఐస్ ఏర్పడటానికి కారణమవుతుందట. ఈ కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని చెబుతున్నారు. ఎప్పు కూడా ఫ్రీజర్ లో వేడి ఆహార పదార్థాలను ఉంచడం వల్ల తేమ విడుదలవుతుందట. ఇది ఐస్ గా మారుతుంది. ఆహారాన్ని గది ఉష్ణోగ్రతకు చల్లబరచిన తర్వాత మాత్రమే ఫ్రీజర్ లో నిల్వ చేయాలి. వండిన ఆహారం లేదా వేడి పాలను నేరుగా ఫ్రీజర్‌లో ఉంచకుండా, ముందుగా చల్లబడేలా చూసుకోవాలట.
అలాగే ఫ్రీజర్ తలుపు సరిగా మూయబడకపోతే, బయటి తేమ లోపలికి చేరి ఐస్ ఏర్పడుతుంది. ప్రతి ఉపయోగం తర్వాత తలుపు గట్టిగా మూసివేయాలి. ఒక కాగితాన్ని తలుపు, ఫ్రీజర్ మధ్య ఉంచి, తలుపు మూసినప్పుడు కాగితం సులభంగా జారిపోతే, సీల్ దెబ్బతిని ఉండవచ్చు దానిని రిపేర్ చేయడం లేదా మార్చడం అవసరం అని చెబుతున్నారు. ఆహార పదార్థాలను ఓపెన్ కవర్లలో లేదా సరిగా మూసివేయని సంచులలో నిల్వ చేయడం వల్ల తేమ విడుదలవుతుందట. ఇది ఐస్ ఏర్పడటానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఎయిర్ టైట్ కంటైనర్లు లేదా జిప్ లాక్ బ్యాగ్ లను ఉపయోగించడం ద్వారా తేమను నియంత్రించవచ్చట.
ఇది ఆహార నాణ్యతను కాపాడడంతో పాటు ఐస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఫ్రీజర్ ను అతిగా నింపడం వల్ల గాలి ప్రసరణ తగ్గుతుందట. ఇది ఐస్ ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుందట. ఫ్రీజర్ లో 75 శాతం సామర్థ్యం వరకు మాత్రమే నింపాలట. తద్వారా గాలి సరిగా ప్రవహించి ఉష్ణోగ్రత సమానంగా ఉంటుందట. అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా ఫ్రీజర్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలనీ చెబుతున్నారు. అలాగే టెంపరేచర్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.