Winter Season: చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది.

  • Written By:
  • Publish Date - October 24, 2022 / 07:30 AM IST

చలికాలపు వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాలపై చలి గాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చలికాలంలో చర్మాన్ని సంరక్షించేందుకు చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సాధనాలు లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించి చలి ప్రభావం చర్మం మీద పడకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. శీతాకాలములో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఒక్కొక్క కాలములో ఒక్కక్క రీతిలో మన చర్మాన్ని రక్షించుకుంటూ ఉండాలి. కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

– ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో పెడుతుండాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి అలర్జీల వంటివి దరిచేరనివ్వకుండా ఉంటాయి.

– చలికి ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నడి వయసుల వారిని ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అటువంటి వారు ఉదయం, సాయంత్రం 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు కాళ్లూ చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి. గర్భిణులు కూడా ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

– చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి, నీటిని కాచి వడబోసుకుని తాగాలి.

– చలికాలంలో కొందరికి కాళ్లు పగులుతాయి. అటువంటి వారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కొబ్బరినూనె వేసి పాదాల్ని అందులో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకోవాలి.