మామూలుగానే మనం బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. బంగాళదుంప ఫ్రై, ఆలూ మసాలా కర్రీ, ఆలూ టిక్కా, ఆలు బోండా, ఆలూ బిర్యానీ ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బంగాళదుంప తయారుచేసిన హల్వాను తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు – రెండు
పంచదార – నాలుగు స్పూన్లు
ఎండు ద్రాక్ష – ఒకటి
బాదం పప్పులు – నాలుగు
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
పాలు – పావు కప్పు
జీడిపప్పులు – ఐదారు
పచ్చి యాలకుల పొడి – పావు టీ స్పూను
తయారీ విధానం :
ఇందుకోసం బంగాళాదుంపలను మెత్తగా ఉడకబెట్టి పైన తొక్క తీసేయాలి. వాటిని మెత్తగా చేత్తో మెదిపి ముక్కలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. మంటను మీడియం మీద ఉండేలా చూసుకోవాలి. నెయ్యి వేడెక్కాక అందులో మెదిపిన బంగాళాదుంపలను రెండు మూడు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు అందులో పాలు, పంచదార వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. మాడిపోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద నెయ్యిలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంప హల్వా ఉడుకుతున్నప్పుడు ఈ నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను పైన చల్లుకోవాలి. అంతే ఆలు హల్వా రెడీ అయినట్టే.