మామూలుగా మనం బంగాళదుంపతో అలాగే కాలీఫ్లవర్ తో రకరకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఈ రెండింటిని కలిపి ఎప్పుడైనా తిన్నారా. కాంబినేషన్లో ఎప్పుడైనా వంటలు తయారు చేశారా. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయకపోతే పొటాటో కాలిఫ్లవర్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలి అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పొటాటో కాలిఫ్లవర్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు- 2 పెద్ద సైజువి
కాలీఫ్లవర్ – 1
జీలకర్ర- 1టీస్పూన్
పసుపు- అరటీస్పూన్
ఎర్రకారం-1టీస్పూన్
చాట్ మసాలా- 1టీస్పూన్
కొత్తిమీర తరగు – కొద్దిగా
శనగపిండి- అరకప్పు
పొటాటో కాలిఫ్లవర్ కబాబ్ తయారు విధానం:
మొదట కాలీఫ్లవర్ నుంచి పుష్పాలను వేరు చేసి శుభ్రంగా కడగాలి. బంగాళదుంపల తొక్కలు తీసి వాటిని ఉడకబెట్టాలి. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ లో కాలీఫ్లవర్ పువ్వులు, జీలకర్ర, పసుపు, ఎర్రకారం, చాట్ మసాలా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు, అరకప్పు వేయించిన శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుని కబాబ్స్ మాదిరి చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత కబాబ్ టిక్కిని ఉంచి రెండు వైపులా కాల్పుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో కాలిఫ్లవర్ కబాబ్ రెడీ.