. మలబద్దకం పెరుగుతున్న కారణాలు
. ఎండుద్రాక్ష పెరుగు తయారీ విధానం
. ఎండుద్రాక్ష–పెరుగు ఆరోగ్య ప్రయోజనాలు
Constipation : ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సంబంధిత సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటిలో మలబద్దకం ఒక సాధారణమైన సమస్యగా కనిపించినప్పటికీ, దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. భారతదేశంలో సుమారు 22 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారని, అందులో 13 శాతం మందికి తీవ్ర స్థాయిలో ఈ సమస్య ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతోంది. చాలామంది తక్షణ ఉపశమనం కోసం మందులపై ఆధారపడుతున్నారు. అయితే తరచూ మందులు వాడటం శరీరానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే మలబద్దకం నుంచి బయటపడాలంటే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే వైద్యులు సూచిస్తున్న ఒక సులభమైన, సహజమైన మార్గం ఎండుద్రాక్షను పెరుగుతో కలిపి తీసుకోవడం.
ఆధునిక కాలంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫైబర్ లోపం ఏర్పడుతోంది. అలాగే రోజంతా కూర్చునే జీవనశైలి, వ్యాయామం లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. నీటి వినియోగం తగ్గడం కూడా మలబద్దకానికి ప్రధాన కారణం. ఈ అలవాట్లు కొనసాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే సహజంగా జీర్ణక్రియను మెరుగుపరిచే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండుద్రాక్ష పెరుగును తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో తాజా గోరువెచ్చని పాలను తీసుకుని అందులో నాలుగు లేదా ఐదు నల్ల ఎండుద్రాక్షలను వేయాలి. తర్వాత తోడుకు సరిపడేలా ఒక చుక్క పెరుగు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రాత్రంతా కదలకుండా ఉంచితే ఉదయానికి రుచికరమైన పెరుగు సిద్ధమవుతుంది. ఈ పెరుగును భోజనంతో పాటు లేదా స్నాక్‌గా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది.
ఎండుద్రాక్షలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పెరుగు ప్రోబయోటిక్‌లా పనిచేసి పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల మలబద్దకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు మంట వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. చెడు బ్యాక్టీరియా తగ్గడంతో ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా తగ్గుతుంది. ఇంతేకాకుండా, ఎండుద్రాక్ష పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి, దంతాలు–చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కీళ్ల నొప్పులు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉండటంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. పిల్లల్లో ఎదుగుదల మెరుగుపడేందుకు ఇది ఉపయోగకరం. ఎండుద్రాక్షతో చేసిన పెరుగు మలబద్దకానికి సహజ పరిష్కారంగా పనిచేయడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని మొత్తం మీద మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు దూరంగా ఉంటాయి.
