. ఆపిల్ సైడర్ వెనిగర్.. రోజ్ వాటర్ టోనర్లు
. కీరదోసకాయ టోనర్‌తో చల్లదనం, తేమ
. గ్రీన్ టీ, తేనె..పుదీనా టోనర్ ప్రయోజనాలు
Natural Face Toners : మార్కెట్‌లో దొరికే కెమికల్ టోనర్లకు బదులుగా ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకునే చర్మ టోనర్లు చర్మానికి మరింత భద్రంగా, ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి చర్మం సహజ pH స్థాయిని సమతుల్యం చేయడమే కాకుండా తేమను నిలుపుకోవడంలో మురికిని తొలగించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్, కీరదోసకాయ, గ్రీన్ టీ వంటి సహజ పదార్థాలు చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు వాటి ఉపయోగాలు తయారీ విధానాలను చూద్దాం. ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక సహజ చర్మ టోనర్‌గా చాలా ప్రసిద్ధి. ఇది చర్మం pH స్థాయిని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో ఉండే ఎసిటిక్ ఆమ్లం చర్మంలోని మలినాలను తొలగించి మృత కణాలను తొలగించే ఎక్స్ఫోలియేషన్ ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకొని మొటిమల సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడానికి ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్‌కు రెండు లేదా మూడు భాగాల నీటిని కలిపి బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. శుభ్రమైన దూదిని ఈ మిశ్రమంలో ముంచి ముఖంపై మెల్లగా అప్లై చేయాలి. అదే విధంగా పొడి చర్మం ఉన్నవారికి రోజ్ వాటర్ చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి శాంతిని కలిగిస్తాయి. 40 మిల్లీలీటర్ల రోజ్ వాటర్‌లో 5 మిల్లీలీటర్ల గ్లిజరిన్ కలిపి శుభ్రమైన ముఖంపై కాటన్ సహాయంతో అప్లై చేయవచ్చు.
కీరదోసకాయ అంటేనే చల్లదనం. ఇందులో అధికంగా నీటి శాతం ఉండటం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ఎండదెబ్బ, చర్మ మంట, అలసట వంటి సమస్యలకు ఇది సహజ ఉపశమనం ఇస్తుంది. ఇంటి వద్ద కీరదోసకాయ టోనర్ తయారు చేయడం చాలా సులభం. రెండు కీరదోసకాయ ముక్కలను తురుముకుని రసం పిండాలి. ఈ రసాన్ని వడకట్టి చిన్న బాటిల్‌లో ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. అవసరమైనప్పుడు దూదితో ముఖానికి అప్లై చేస్తే చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. గ్రీన్ టీలో సహజంగా టోనింగ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచి మొటిమలు ఏర్పడకుండా కాపాడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాలుష్యం వయస్సు ప్రభావాల నుంచి రక్షిస్తాయి.
దీనిని తయారు చేయడానికి రెండు కప్పుల నీటిని మరిగించి అందులో రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ వేసి సుమారు 20 నిమిషాలు ఉంచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. రోజూ ముఖానికి అప్లై చేయవచ్చు. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. పుదీనా ఆకులు చర్మానికి ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి. పోర్స్‌ను చిన్నగా కనిపించేలా చేస్తాయి. పుదీనా ఆకులను మరిగించి వడకట్టి అందులో కొద్దిగా తేనె కలిపి టోనర్‌లా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది. ఈ విధంగా సహజ పదార్థాలతో తయారు చేసిన టోనర్లు చర్మానికి దీర్ఘకాలిక మేలు చేస్తాయి. రెగ్యులర్‌గా ఉపయోగిస్తే సహజ మెరుపు మీ చర్మానికే సొంతం.
