స్వేచ్ఛ, సమానత్వం ఈ రెండు ఉంటే చాలామంది మహిళల్లో ఎలాంటి అసాధ్యమైనా సుసాధ్యం చేసే సత్తా ఉంటుంది. ఇక ప్రస్తుతం కాలంలో మగవారికి తాము ఏమాత్రం తక్కువ కాదనే విధంగా మహిళలు తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. గొప్ప గొప్ప స్థానాల్లో రాణిస్తున్నారు. ఎన్నో రంగాల్లో కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. కేవలం కెరీర్‌లోనే కాదు, చెడు అలవాట్లలోనూ ముందుంటున్నారు. అవును, మీరు చదివింది నిజమే….
మగాళ్లకు ఏమాత్రం తగ్గకుండా స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం… మగువల విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే, వారిని ఆ విషయాల్లో మించిపోతున్నారనే చెప్పొచ్చు. ఈ విషయాన్ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం… గత ఐదు సంవత్సరాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మద్యం సేవించారట. ఒడిశాకు సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. ఈ రాష్ట్రంలో 2015-16లో 15 ఏళ్లకు పైబడిన వారు ఆల్కహాల్ సేవించే వారి శాతం కేవలం 2.4 శాతంగా ఉండేది. కానీ 2020-21 నివేదికల ప్రకారం.. ఈ సంఖ్య దాదాపు 4.3 శాతంగా మారింది. అదే 2015-16లో ఆల్కహాల్ తాగే పురుషులు 39.0 శాతం కాగా…. 2020-21కి ఈ సంఖ్య 28.8 శాతానికి తగ్గిందట.
కేవలం పట్టణాల్లోనే ఆల్కహాల్ తాగుతారనుకోకండి. ఎందుకంటే.. ఒడిశాలో పట్టణ ప్రజలకంటే గ్రామీణ ప్రజలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని తేలింది. అది కూడా 15 ఏళ్ల పైన పడిన వారే ఎక్కువ అట. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు 30.2 శాతంగా ఆల్కహాల్ తీసుకుంటే… అదే పట్టణాల్లో 22.7 శాతంగా మద్యం సేవిస్తున్నారట. ఇకపోతే పట్టణాల్లో స్త్రీలు 1.4 శాతంగా తాగితే…. గ్రామాల్లో 4.9 శాతం మద్యం తీసుకుంటున్నారు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా… గ్రామీణ ప్రాంతాల్లోని ఆడవారు ఆల్కహాల్ వినియోగించే శాతం 2.4 నుంచి 4.9 శాతానికి పెరిగిందట. అదే పురుషులు ఇందుకు భిన్నంగా ఉన్నారట. వీరు
41.3 శాతం నుంచి 20.2 శాతానికి చేరుకున్నారు. ఆడవారు ఆల్కహాల్ వినియోగాన్ని పెంచితే మగవారు తగ్గించారు. కాగా పట్టణ ప్రాంతాల్లో ఐదేళ్ల కాలంలో ఆడవారి ఆల్కహాల్ వినియోగంలో పెద్ద మార్పులు ఏమీ రాలేదట. కానీ వీరి సంఖ్య 1.3 నుంచి 1.4 శాతానికి చేరుకుందని అధ్యయనాల్లో తేలింది.
ఇక స్మోకింగ్ విషయంలో మగజాతిని వెనక్కి నెట్టేశారని సర్వేలో తేలింది. స్మోకింగ్ చేసే మహిళలు 2015-16లో 17.3 శాతంగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా 26 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది.
