Mutton Rogan Josh: రంజాన్ స్పెషల్.. మటన్‌ రోగన్‌ జోష్‌ రెసిపీ ఇంట్లోనే చేసుకోండిలా?

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 03:45 PM IST

ప్రస్తుతం రంజాన్ నెల నడుస్తోంది. అయితే ఈ రంజాన్ నెలలో మనకు ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ లభిస్తూ ఉంటాయి. రంజాన్ నెలలో మాత్రమే కొన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో మటన్ రోగన్ జోష్ రెసిపీ. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు :

మటన్‌ – కిలో
పాలు– కప్పు
కుంకుమ పువ్వు– చిటికెడు
నెయ్యి– అర కప్పు
ఇంగువ – అర టీ స్పూన్‌
జీలకర్ర– టీ స్పూన్‌
దాల్చిన చెక్క – 2 అంగుళాల ముక్క
నల్ల యాలకులు – 5
మిరియాలు – టీ స్పూన్‌
ఎండుమిర్చి– 4
పెరుగు– 150 గ్రా
గోధుమపిండి– టేబుల్‌ స్పూన్‌
శొంఠిపొడి – 2 టీ స్పూన్‌లు
ఉప్పు – టీ స్పూన్‌
ధనియాల పొడి– టేబుల్‌ స్పూన్‌
మిరపపొడి– టేబుల్‌ స్పూన్
సోంపు పొడి– టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తరుగు – కొద్దిగా

తయారీ విధానం :

ముందుగా మటన్‌ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ప్రెషర్‌ పాన్‌లో నెయ్యి వేడి చేసి దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న మంట మీద వేయించాలి. అవి వేగిన తరవాత అందులో మటన్‌ వేసి కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఐదారు నిమిషాల సేపు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీటిని పోసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి. మరొక పాత్రలో పెరుగు, గోధుమ పిండి కలిపి అందులో కుంకుమ పువ్వు కలిపిన పాలు, ఉప్పు, సోంపు పొడి, ధనియాల పొడి, కశ్మీరీ మిరప్పొడి, శొంఠిపొడి కలిపి ఈ మొత్తం మిశ్రమాన్ని మటన్‌ మిశ్రమంలో కలిపి చిక్కదనం చూసుకుని అవసరమైతే మరికొంత నీటిని కలిపి, ప్రెషర్‌ పాన్‌ మూత పెట్టి ఐదారు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. వేడి, ప్రెషర్‌ తగ్గిన మూత తీసిన కొత్తిమీర తరుగు చల్లి వెంటనే మూత పెట్టాలి. ఈ మటన్‌ రోగన్‌ జోష్‌ చపాతీ, పుల్కాలతోపాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.