వేసవి కాలంలో (Summer Time) శరీరాన్ని చల్లగా ఉంచేందుకు మరియు డీహైడ్రేషన్ సమస్యలను తగ్గించేందుకు కర్భూజ పండు ఎంతో ఉపయోగకరమైనదిగా మారుతుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, జింక్, పొటాషియం మరియు ఫాస్పరస్ లాంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ పండు మంచిదని చెప్పలేము. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఈ సమస్యలు ఉన్నవారు కర్భూజను దూరంగా ఉంచాలి
డయాబెటిస్ (Diabetes) ఉన్నవారు కర్భూజ (Muskmelon ) పండును పరిమిత మోతాదులో తీసుకోవాలి, ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 60-80 మధ్య ఉండటంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, శ్వాసకోశ సంబంధిత అలర్జీలు, చర్మ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని తినడానికి ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) ఉన్నవారు కర్భూజను ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్, కొన్ని సందర్భాల్లో మలబద్ధకాన్ని కూడా పెంచవచ్చు.
కిడ్నీ వ్యాధులు మరియు హైపోనాట్రేమియా ఉన్నవారికి మంచిది కాదు
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కర్భూజను తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే ఇందులో అధికంగా ఉండే పొటాషియం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేయవచ్చు. అలాగే, హైపోనాట్రేమియా సమస్య ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే ఇందులో 90% నీటి శాతం ఉండటంతో శరీరంలోని సోడియం స్థాయిలను తగ్గించి నీటి నిల్వలు పెరిగే అవకాశముంది. కర్భూజను తీసుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం లేదా మధ్యాహ్నం, కానీ ఖాళీ కడుపుతో తినడం మంచిది కాదు. మితంగా తీసుకుంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.