Moongdal Laddu: పిల్లల కోసం పెసర లడ్డూ.. బోలెడు పోషకాలు..

పిల్లలకు శరీరానికి శక్తిని అందించే ఆహారాలను పెట్టడం చాలా ముఖ్యం. ఈవినింగ్ టైం లో ఇంట్లోనే తయారు చేసిన పెసర లడ్డూలను తినడం వల్ల చికెన్..

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 10:57 PM IST

Moongdal Laddu: సాయంత్రమైతే చాలు.. పిల్లలకు ఏం స్నాక్స్ ఇవ్వాలా అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. మార్కెట్లో దొరికే.. చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు తరచూ పెడుతుంటారు. కానీ.. పిల్లలకు శరీరానికి శక్తిని అందించే ఆహారాలను పెట్టడం చాలా ముఖ్యం. ఈవినింగ్ టైం లో ఇంట్లోనే తయారు చేసిన పెసర లడ్డూలను తినడం వల్ల చికెన్, మటన్, చేపలు వంటివి తినడంతో వచ్చే పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. ఆయుర్వేదంలో కూడా పెసలకు మంచి స్థానమే ఉంది. మరి పెసలతో లడ్డూలను ఎలా తయారు చేయాలో చూద్దాం.

పెసర లడ్డూ రెసిపీకి కావలసిన పదార్థాలు

పెసలు – 1 కప్పు

పాలపొడి – 1/2 కప్పు

బెల్లం తురుము – 1 కప్పు

యాలకులపొడి – 1/2 స్పూను

బాదం తురుము – 2 స్పూన్లు

పిస్తా తురుము – 2 స్పూన్లు

జీడిపప్పు తురుము – 3 స్పూన్లు

నెయ్యి – 1/2 కప్పు

పెసర లడ్డూ తయారీ విధానం

పెసలు లేదా పెసరపప్పును తీసుకుని.. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో పెసలు వేసి చిన్నమంట మీద వేయించాలి. వాటిని చల్లార్చి.. ఇప్పుడు ఆ పెసల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. బెల్లం తురుమును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.

పెసరపిండిలో బెల్లంపొడి, పాలపొడి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. బాదం, పిస్తా, జీడిపప్పు తురుములను కూడా వేసి కలపాలి. లడ్డూలు చుట్టేందుకు వీలుగా నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లడ్డూలుగా చుట్టుకుని గాలి చొరబడని సీసాలో వేసి నిల్వ ఉంచుకోవాలి. ఇవి నెలరోజుల వరకూ తాజాగా ఉంటాయి.

రోజుకొక లడ్డూ తింటే.. ప్రొటీన్లు అందుతాయి. కాబట్టి మాంసాహారం తిననివారు ఈ పెసరప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని పెంచి మెరుపునిస్తుంది. ఉదయాన్నే నానబెట్టిన పెసలను తింటే యాంటీ ఏజింగ్ లక్షణాల నుంచి బయటపడొచ్చు.