మామూలుగా మనం మెంతి ఆకులను అనేక రకాల కూరలో ఉపయోగిస్తూ ఉంటాం. మెంతికూర పప్పు, మెంతుకూర పచ్చడి లాంటి రెసిపీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సాయంత్రం పూట స్నాక్స్‌గా అప్పుడప్పుడు మెంతికూర పకోడీ చేసుకుని చూడండి. రుచి కొత్తగా ఉంటుంది. మరి మెంతి పకోడీని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మెంతి పకోడీకి కావాల్సిన పదార్థాలు:
మెంతి ఆకులు – రెండు కప్పులు
పచ్చిమిర్చి – రెండు
ఉల్లిపాయ – ఒకటి
అల్లం – చిన్న ముక్క
కారం – అర స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను
వంట సోడా – చిటికెడు
సెనగపిండి – ఒక కప్పు
మెంతి పకోడీ తయారీ విధానం
ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో శెనగపిండిని వేయాలి. రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన మెంతి ఆకులు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, పసుపు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు నీళ్లు కలుపుకొని పకోడీ పిండిలా ఉండల్లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి. మీకు పకోడీ గట్టిగా రావాలనుకుంటే నీళ్లు తక్కువ వేసుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువ వేసుకుంటే పకోడీ మెత్తగా వస్తుంది. ఆపై స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఈ పిండితో పకోడీలను వేసుకోవాలి. పకోడీ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతి పకోడీ రెడీ.