ఆకుకూరలు(Green Leafy Vegitables) ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో బచ్చలికూర(Malabar Spinach) లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకును మనం ఆహారంలో భాగంగా తినడం వలన మనకు కంటిచూపు మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలికూరతో పప్పు లేదా పచ్చడి ఏదయినా చేసుకొని తినవచ్చు.
బచ్చలికూర పప్పు తయారీకి కావలసిన పదార్థాలు..
* కందిపప్పు అర కప్పు
* బచ్చలికూర రెండు కట్టలు
* ఉల్లిపాయలు రెండు తరిగినవి
* పచ్చిమిర్చి నాలుగు
* టమాటాలు రెండు
* వెల్లుల్లి రెబ్బలు పది
* నూనె కొద్దిగ
* ఉప్పు తగినంత
* కారం తగినంత
* నానబెట్టిన చింతపండు కొద్దిగ
* పసుపు కొద్దిగ
* తాలింపు దినుసులు కొన్ని
* ఎండుమిర్చి రెండు
* కరివేపాకు రెబ్బలు రెండు
* ధనియాల పొడి ఒక స్పూన్
బచ్చలికూర పప్పు తయారు చేయు విధానం..
కందిపప్పును ముందు ఒక గంట సేపు నానబెట్టాలి. తరువాత కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. లేదా కందిపప్పును తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిన తరువాత పప్పును మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి తాలింపు దినుసులు వెయ్యాలి. అవి వేగిన తరువాత ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తరువాత తరిగిన టమాటాలు వేయాలి. టమాటాలు బాగా ఉడికిన తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి కలపాలి.
తరువాత బచ్చలికూర ఆకులను వేసి మూత పెట్టాలి. మధ్య మధ్యలో మూత తీసి కలబెడుతూ ఉండాలి. అలా బచ్చలికూర ఆకు ఉడికేంతవరకు చేయాలి. ఆకు ఉడికిన తరువాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పును, నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుండి రసం తీసి ఆ రసాన్ని వేయాలి. దీనిపై మూత పెట్టి ఒక పది నిముషాల పాటు ఉడికించాలి తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా చేస్తే బచ్చలికూర పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం లేదా చపాతీతో పాటు పెట్టుకొని తినవచ్చు.
Also Read : Foxtail Millet Dosa : కొర్రలతో అల్పాహారం.. దోసల తయారీ విధానం..