Site icon HashtagU Telugu

Kobbari Pudina Pachadi : కొబ్బరి పుదీనా పచ్చడి ఇలా చేస్తే.. లొట్టలేస్తూ తినేస్తారంతే..

kobbari pudina pachadi

kobbari pudina pachadi

Kobbari Pudina Pachadi : పచ్చికొబ్బరి.. దీనిని వంటల్లో ఉపయోగిస్తుంటారు. సాంబార్ లో, కొన్నిరకాల పచ్చళ్లలో ఎక్కువగా వాడుతుంటారు. ఉదయంపూట టిఫిన్లలోకి కొబ్బరితో కలిపి పల్లీల చట్నీ చేస్తే.. ఏ టిఫిన్ అయినా వద్దనరంటే నమ్మండి. అలాగే కొబ్బరి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరిపచ్చడిని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలతో కూడా చేస్తారు. పెరుగుతో కలిపి చేసే కొబ్బరిపచ్చడి కూడా చాలా బాగుంటుంది. అలాగే పుదీనాతో కలిపి కూడా కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పుదీనా పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

మినపగుళ్లు – 1/2 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1/2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
నువ్వులు – 1 టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 10-15
పచ్చికొబ్బరి ముక్కలు – 1/2 కప్పు
తరిగిన టమాటా ముక్కలు – 1 కప్పు
పుదీనా ఆకులు – 2 కప్పులు
ఉప్పు – రుచికి తగినంత
చింతపండు – 1 రెమ్మ
వెల్లుల్లి రెబ్బలు – 3

కొబ్బరి పుదీనా పచ్చడి తయారీ విధానం

ఒక కళాయిలో శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తర్వాత ధనియాలు, జీలకర్రవేసి వేయించి.. చివరిగా నువ్వులు వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో నూనెవేసి.. వేడయ్యాక.. పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాట ముక్కలు, పుదీనా ఆకులు వేసి కలిపి మూతపెట్టి.. టమాట ముక్కలు మగ్గేంతవరకూ ఉంచి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత.. జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోనే వేయించిన పదార్థాలన్నింటినీ వేసుకుని.. ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని తాలింపు వేసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే.. అమృతంలా ఉంటుంది. కొబ్బరిపచ్చడి నచ్చనివారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.