మామూలుగా మనకు అప్పుడప్పుడు తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కొంతమంది మసాజ్ సెంటర్లకు వెళ్లి హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే అమ్మతో లేదా భార్యతో హెడ్ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. టెన్షన్ పడుతున్నప్పుడు, ఒత్తిడిగా ఫీల్ అవుతున్నప్పుడు అలాగే తలనొప్పిగా అనిపించినప్పుడు గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేస్తే ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్, తల భారం తగ్గినట్లు అనిపిస్తుంది. తలను ఆయిల్ మసాజ్ చేస్తే మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు బాగా ఎదుగుతుంది.
కేవలం ఇవి మాత్రమే కాకుండా హెడ్ మసాజ్ చేయడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తలను తరచుగా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య ఉన్నవారు తరచూ ఆయిల్ మసాజ్ చేసుకుంటే చుండ్రు సమస్య దూరం అవుతుంది. హెడ్ మసాజ్ చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి. మాడుకు మర్దన చేసేటప్పుడు ఉపయోగించే నూనె జుట్టుకు పోషణనందించే జోజోబా, బాదం, కొబ్బరి నూనె అయితే మంచిది. దీనివల్ల కుదుళ్లకు రక్తప్రసరణ సాఫీగా జరగడమే కాకుండా కురులకు పోషణ కూడా లభిస్తుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడం లోనూ మసాజ్ సహాయపడుతుంది. హెడ్ మసాజ్‌తో ముఖం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. మాడుకు మృదువుగా మర్దన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. అలాగే తలకు మర్దన చేయడం వల్ల ముఖానికి కూడా రక్తప్రసరణ సవ్యంగా జరిగి మోము కాంతివంతంగా మారుతుంది.