Site icon HashtagU Telugu

Aims report : రోడ్డు ప్రమాదాలకు కారణం నిద్రలేమి.. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం సంచలన రిపోర్టు

Aims Report

Aims Report

Aims report : రోడ్డు ప్రమాదాల వెనుక నిద్రలేమి ఒక ప్రధాన కారణంగా ఉందని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యుల బృందం వెల్లడించింది. సుదీర్ఘ ప్రయాణాల వల్ల నిద్రలేమి, తీవ్రమైన అలసట కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనివల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఎయిమ్స్ వైద్యులు తమ సంచలనాత్మక నివేదికలో పేర్కొన్నారు.

సాధారణంగా రోడ్డు ప్రమాదాలు మలుపులు, ఖాళీ రోడ్లు, లేదా రాత్రిపూట ఎక్కువగా జరుగుతుంటాయని ప్రజలు అనుకుంటారు. కానీ, ఎయిమ్స్ వైద్యుల అధ్యయనం ప్రకారం, చాలా ప్రమాదాలు తరచూ ప్రయాణించే రహదారులపైనే జరుగుతున్నాయి. నిద్రలేమి కారణంగా వాహనదారుడు ప్రయాణించే మార్గం సురక్షితమైనదని భావించి, అజాగ్రత్తగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు అధికమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

మనం చేసే ఏ ప్రయాణమైనా గమ్యాన్ని చేరుకోవడానికి సురక్షితమైనదిగా భావించినప్పుడు, ఆ ప్రయాణంలో మన మెదడు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తుంది. కానీ, నిద్రలేమి వల్ల మెదడు నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా, వాహనదారుడు వేగాన్ని అదుపులో ఉంచుకోలేకపోవడం, సడెన్ బ్రేకులు వేయలేకపోవడం, మలుపుల్లో నియంత్రణ కోల్పోవడం వంటి సంఘటనలు జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి.

అవగాహన లేకపోవడం..

అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సమస్యను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టారు. అక్కడ వాహనదారులు వాహనం నడిపే ముందు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తారు. భారతదేశంలో నిద్రలేమి ప్రమాదాలపై పెద్దగా అవగాహన లేదు. ఈ నివేదిక దేశంలోని రోడ్డు భద్రతా విధానాలను, ప్రజల ఆలోచనా విధానాలను మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

ఎయిమ్స్ వైద్యుల బృందం ఇచ్చిన ఈ నివేదిక రోడ్డు భద్రతపై ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ నియమాలే కాకుండా, వాహనదారుల ఆరోగ్యం, నిద్ర వంటి అంశాలపై దృష్టి సారించడం ఎంత ముఖ్యమో ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. దీనిపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను, మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, ఇక్కడ కూడా వాహనదారులకు 8 గంటల నిద్ర గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు నొక్కి చెబుతున్నారు.నిద్ర సరిగా లేకపోతే వాహనం నడిపే సమయంలో నిద్రరావడం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అదే విధంగా డ్రైవర్లకు ఒత్తిడి లేని ఎక్కువ సమయంతో కూడిన డ్యూటీలు వేయరాదని కేంద్రం చట్టం తేవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

Lokesh : రజినీకాంత్ ‘కూలీ’ కోసం లోకేష్ షాకింగ్ రెమ్యునరేషన్..!