Site icon HashtagU Telugu

Alcohol Effects: అతిగా తాగితే అనర్ధమే.. మద్యంతో ముసలితనం వస్తుందట!

liquor

liquor

రోజురోజుకూ మద్యం సేవించివాళ్ల సంఖ్య తగ్గుతుందే తప్పా తగ్గడం లేదు. మహిళలు, టీనేజ్ పిల్లలు సైతం సరదా కోసం తాగుతున్నారు. అయితే కిక్ సంగతి పక్కన పెడితే దాని వల్ల అనేక అనర్థాలున్నాయట. గుండె మెదడులకు ఆల్కహాల్ వలన జరిగే హాని మరింత ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈస్ట్ ఏంజిలియా యూనివర్శిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో విషయం వెల్లడైంది. ఆల్కహాల్ వలన శరీరంలోని కండరాలు చాలా వేగంగా కుచించుకుపోతాయని ఈ నూతన అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

ఆల్కహాల్ అధికంగా తాగేవారిలో శరీరమంతటా అస్థిపంజరంలో ఎముకలకు అంటుకుని ఉండే కండరాలు క్షీణించి పోతాయని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. అంటే మితిమీరిన ఆల్కహాల్ వలన వయసుమీరిన లక్షణాలు త్వరగా కనబడతాయి. సుమారు రెండు లక్షల మంది 37 నుండి 73 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో చాలామంది యాభైలు, అరవైల వయసులో ఉన్నవారు. యుకెలోని ఓ బయో బ్యాంక్ నుండి వీరి జీవనశైలి, ఆరోగ్యాల తాలూకూ వివరాలను సేకరించారు.

రోజుకి పదిలేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల ఆల్కహల్ తీసుకునేవారిలో కండరాల క్షీణత చాలా ఎక్కువగా ఉందని, ఆల్కహాల్ తక్కువగా తాగేవారిలో కంటే వీరిలో కండరాలు మరింతగా సాంద్రతని కోల్పోవటం గమనించామని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా ముసలితనంలో కండరాల సాంద్రత తగ్గిపోతుంది. దాంతోవారు బలహీనంగా శక్తిహీనంగా మారుతుంటారు. అనారోగ్యాలకు గురవుతుంటారు.