Coffee and Sleep: కాఫీ తాగితే… కమ్మని నిద్ర.!

సాధారణంగా కాఫీ తాగితే నిద్రమత్తుపోతుంది. అందుకే పనిచేస్తున్నపుడు అలసట నిద్ర పోవడానికి కాఫీ టీలు తాగుతుంటారు చాలామంది.

  • Written By:
  • Publish Date - August 24, 2022 / 09:30 PM IST

సాధారణంగా కాఫీ తాగితే నిద్రమత్తుపోతుంది. అందుకే పనిచేస్తున్నపుడు అలసట నిద్ర పోవడానికి కాఫీ టీలు తాగుతుంటారు చాలామంది. అయితే జపాన్ లో నిర్వహించిన ఓ సర్వేలో కాఫీ చక్కని నిద్రని ఇస్తుందని తేలింది. రెండువందల మిల్లీ గ్రాముల కాఫీ తీసుకుని ఇరవైనిముషాలపాటు కునుకు తీసినా లేదా విశ్రాంతి తీసుకున్నా అది మెదడుని మరింత చురుగ్గా అప్రమత్తంగా మారుస్తుందని, చక్కని నిద్రపట్టే స్థితి ఏర్పడుతుందని ఆ సర్వేలో తేలింది. అందుకే ఇప్పుడు అక్కడ ఎక్కువమంది అలా కాఫీ కునుకులు తీస్తున్నారట. కాఫీని తీసుకున్నపుడు మెదడులోని అడెనోసిన్ అనే అణువులను అది క్లియర్ చేస్తుంది. ఈ అడెనోసిన్ స్థాయిలు పెరిగితే బాగా అలసిపోయినట్టుగా అయిపోతుంటారు. కాఫీ వీటిని తొలగించడం వలన అలసట పోయి చురుగ్గా మారతారు. కాఫీ తాగి కాసేపు కునుకు తీయటం వలన అడెనోసిన్ ప్రభావం మరింతగా తగ్గుతుంది. అలాగే కాఫీ కునుకు వలన అడెనోసిన్ ప్రభావం మెదడుపైన తగ్గటంతో ఆ తరువాత సమయంలో కూడా చక్కని నిద్రపడుతుంది. ఇలాంటి మరికొన్ని భిన్నమైన ఆరోగ్య అంశాలు మీకోసం…

తినగానే బ్రష్ చేయవద్దు…
ఏదన్నా తిన్న తరువాత లేదా తాగిన తరువాత బ్రష్ చేసుకుని దంతాలను శుభ్రం చేసుకోవటం మంచిదని మనకు తెలుసు కదా. కానీ కొన్నిసార్లు అలా చేస్తే మన దంతాలకు హాని కలుగుతుంది. పులుపు రుచి ఉన్న సిట్రస్ పళ్లు, హెల్త్ డ్రింకులు, సోడా, టమోటాలు వంటివి తీసుకున్నపుడు మన దంతాలపైన ఉన్న ఎనామిల్ మృదువుగా మారుతుంది. ఈ సమయంలో బ్రష్ చేస్తే దానికి హాని కలుగుతుంది. ఎనామిల్ కింది పొర కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక పైన పేర్కొన్న ఆహార పదార్థాలు ద్రవాలను తీసుకున్న తరువాత వెంటనే కాకుండా అరగంట తరువాత మాత్రమే బ్రష్ చేసుకోవాలి.

కడుపు ఉబ్బరం ఉన్నపుడు మంచినీళ్లు…
కడుపు ఉబ్బరం ఉన్నపుడు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అసలే ఉబ్బరంగా ఉంటే మళ్లీ మంచినీళ్లెందుకు అనుకుంటున్నారా? అన్ని సమయాల్లో కాదు… పీచు పదార్థాలు ఉన్న తృణధాన్యాలు, పప్పులు వంటి ఆహారాలు ఎక్కువగా తినటం వలన కడుపు ఉబ్బరం సమస్య ఏర్పడితే నీరు ఎక్కువ తాగాలి. దీనివలన పీచు నీటిలో కరిగి జెల్ లా తయారవుతుంది. దాంతో ఉబ్బరం తగ్గుతుంది. అలాగే శరీరంలోనీరు తగినంత లేనప్పుడు కూడా కడుపు ఉబ్బరం కలుగుతుంది. అందుకే డీ హైడ్రేషన్ కి గురయినప్పుడు కూడా మంచినీళ్లు ఎక్కువగా తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

బయట వేడిగా ఉంటే వేడి టీ తాగాలి
బయట ఎండగా ఉండి వాతావరణం బాగా వేడిగా ఉన్నపుడు చల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది కదా…కానీ ఇలాంటప్పుడు వేడి టీ లేదా కాఫీ తాగాలి. అలా చేసినప్పుడు మన శరీరం వేడిని గ్రహించడంతో చెమట పడుతుంది. చెమట ఆరిపోయి మన శరీరం చల్లబడుతుంది.