India Suffer: ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ!

ఏంటి గట్టిగా అరుస్తున్నావ్.. బీపీ పెరిగిందా ఏం? అని చాలామంది అంటుంటారు.

  • Written By:
  • Updated On - May 11, 2022 / 11:41 AM IST

ఏంటి గట్టిగా అరుస్తున్నావ్.. బీపీ పెరిగిందా ఏం? అని చాలామంది అంటుంటారు. కానీ నిజంగానే దేశంలో ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ పెరుగుతోంది. అధిక రక్తపోటు సమస్య దేశానికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. భారత వైద్య పరిశోధనా మండలి-ఐసీఎంఆర్, ఇంకా బెంగళూరుకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ అండ్‌ రీసెర్చ్‌ -ఎన్‌సీడీఐఆర్ సంస్థల పరిశోధనలో తేలిన అంశమిది. కానీ చాలామందికి తమకు హైపీబీ ఉందని తెలియదు. పైగా కంట్రోల్ లో ఉంచుకోవడం, చికిత్స తీసుకోవడం కూడా తక్కువే. ప్రతీ నలుగురు పెద్దవారిలో ఒకరికి హైబీపీ ఉన్నా.. వారిలో కేవలం 12 శాతం మంది మాత్రమే తమ బీపీని కంట్రోల్ పెట్టుకుంటున్నారు.

ఈ అధ్యయనం కోసం 2017-18లో నేషనల్ ఎన్సీడీ మానిటరింగ్ సర్వే డేటాను ఉపయోగించుకున్నారు. 19-69 ఏళ్ల మధ్య వయసువారిపై ఈ రీసెర్చ్ జరిగింది. దేశంలో వయోజనుల్లో 28.5 శాతం మందికి హైబీపీ ఉంది. వీరిలో 72.1 శాతం మంది దీనిని గుర్తించలేకపోతున్నారు. కేవలం 27.9 శాతం మందికి మాత్రమే తమకు అధిక రక్తపోటు ఉందన్న సంగతి తెలుసు. బాధితుల్లో 14.5 శాతం మంది హైబీపీకి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. వీరిలో 99.6 శాతం మంది చికిత్స కోసం ఇంగ్లిష్ మెడిసిన్ ను ఉపయోగిస్తున్నారు.

పట్టణాల్లో ఉంటున్న వారిలో 34 శాతం మందికి ఈ బాధ తప్పలేదు. అదే గ్రామాల్లో చూస్తే.. 25.7 శాతం మంది అధిక రక్తపోటు బారిన పడ్డారని తేలింది. అసలు తమకు హైబీపీ ఉందని తెలుసుకున్నవారిలో వృద్దులు, ధనికులు, మహిళలే ఎక్కువ. సిస్టోలిక్ రక్తపోటు 140 ఎంఎం హెచ్ జీ కన్నా ఎక్కువున్నా.. లేదా డయాస్టోలిక్ రక్తపోటు 90 ఎంఎం హెచ్ జీ కన్నా ఎక్కువున్నా.. అలాంటివారిని ఈ రీసెర్చ్ లోకి పరిగణనలోకి తీసుకున్నారు. హైపీబీ ఉంటే అది గుండెజబ్బులు, పక్షవాతానికి దారితీస్తుంది. దేశంలో చనిపోతున్నవారిలో గుండె జబ్బులు, సిస్టోలిక్ రక్తపోటు వాటాయే 28.1 శాతం ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.