అరటిపండ్లు(Bananas) అందరూ తింటారు. కానీ అవి రంగు మారినా లేకపోతే మెత్తగా అయినా తినడానికి చాలా మంది ఇష్టపడరు. అరటిపండ్లు ఎక్కువరోజులు పాడవకుండా నిలువ ఉంచడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. అరటిపండ్లను కొనేటప్పుడు మరీ పండువి కాకుండా కొద్దిగా పక్వానికి వచ్చిన పండ్లను కొనాలి. మనం కొన్ని రోజులు అరటిపండ్లు ఉండాలి అనుకుంటే కొంచెం పచ్చిగా ఉన్నవి కొనాలి. అప్పుడు ఒక వారం రోజుల పాటు అరటిపండ్లు మనం తినడానికి వీలుగా ఉంటాయి.
అరటిపండ్లను వేరే ఇతర పండ్లతో లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి ఉంచకూడదు. అరటిపండ్లను విడిగా ఉంచాలి అప్పుడే తొందరగా పాడవకుండా ఉంటాయి. అదే విధంగా అరటి గెలలో ఒక పండు పండిన వెంటనే దానిని గెల లోనుండి తీసెయ్యాలి. లేకపోతే మిగిలిన పండ్లు తొందరగా పండుతాయి. అరటిపండ్లను మూత ఉన్న కంటైనర్ లేదా ఫ్రీజర్ బ్యాగ్స్ లో ఉంచినా తొందరగా పాడవకుండా ఉంటాయి.
అరటిపండ్లు ఎక్కువకాలం నిలువ ఉంచాలంటే వాటి చివర్లను ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్ తో కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన అరటిపండ్లు ఎక్కువ కాలం నిలువ ఉంటాయి ఇంకా తొందరగా రంగు మారకుండా ఉంటాయి. అరటిపండ్లు రంగు మారుతున్నాయి అని అనిపిస్తే వాటిని చల్లని ప్రదేశంలో ఉంచితే అవి కుళ్ళిపోకుండా ఉంటాయి. చల్లని ప్రదేశంలో ఉంచడం వల్ల అవి రంగు మారినా లోపల పండు బాగుంటుంది.
అరటిపండ్లు తొందరగా పక్వానికి రాకుండా ఉండాలి అనుకుంటే అరటి గెల కొన్న తరువాత ఒక్కొక్క పండుని గెల నుండి విడిగా ఉంచాలి. ఈ విధంగా మనం అరటిపండ్లను ఎక్కువరోజులు నిలువ ఉంచేలా చేయవచ్చు.