చాలామంది స్త్రీ,పురుషులకు ముఖం మెడ అలాగే శరీరంపై పులిపిర్లు వస్తూ ఉంటాయి. అయితే ఎక్కువ శాతం ఈ పులిపిర్లు మెడ భాగంలోనే వస్తూ ఉంటాయి. కొంతమందికీ ఈ పులిపిర్లు వేధిస్తూ ఉంటాయి. మెడ చుట్టూ భాగంలో ఎక్కువగా పులిపిర్లు వచ్చి అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. పులిపిర్లు రావడానికి ప్రధాన కారణం వైరస్. ఈ పులిపిర్లు ఎక్కువగా యుక్త వయసు వారికీ వస్తూ ఉంటాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ఒకవేళ ఒత్తిడి పడేచోట అంటే అరచేతులు, అరికాళ్లు తదితర ప్రాంతాల్లో ఉంటే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.
పులిపిర్లను తగ్గించేందుకు ఆయుర్వేద, గృహ చిట్కాలు ఉన్నాయి. పులిపిరి వచ్చిన చోట వాటర్ ఫ్రూఫ్ స్టిక్కింగ్ టేప్‌ని రెండు మూడు పొరలుగా అతికించాలి. ఆరు రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటలపాటు గాలిని తగలనిచ్చి మళ్లీ ఆరు రోజులపాటు టేప్‌ని అతికించాలి. దీంతో వార్ట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలిచొరబడని వాతావరణం ఏర్పడటం వల్ల వైరస్ నశిస్తుంది. అలాగే వెల్లుల్లి రేకలను పులిపిర్లపై రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిర్లు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. అలాగే ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది.
దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపీర్ల పై ప్రయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతో గానీ లేదంటే మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిర్ల పైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపీర్ల పైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి. రావిపట్టను కాల్చి మసిచేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పైకి పూయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి. పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది.