ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మొటిమల సమస్య కూడా ఒకటి. ఒక వయసు వచ్చిన తర్వాత ఈ మొటిమల సమస్య ప్రారంభమవుతూ ఉంటుంది. మొటిమలు తగ్గించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాల ఫేస్ క్రీములు మాడిన ఈ మొటిమలు మాత్రం తగ్గవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతి రోజూ రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల చర్మం జిడ్డు తగ్గి మృత కణాలు వదిలిపోతాయని చెబుతున్నారు. అలా అని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుందట. కఠినమైన సబ్బులు చర్మానికి చికాకు పరుస్తాయట. అందుకే మృదువైన సబ్బులనే వాడుకోవాలని చెబుతున్నారు. తువ్వాలుతో గట్టిగా రుద్దటం వంటివి చేయవద్దని చెబుతున్నారు. మెత్తటి తువ్వాలును ముఖానికి అద్దుతూ సున్నితంగా తుడుచుకోవాలని సలహా ఇస్తున్నారు.
అలాగే మనలో చాలా మంది మొటిమలను గిల్లుతుంటారు. తరచూ చేతులను ముఖానికి తాకిస్తుంటే బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందట. ఇలా చేస్తే అప్పటికే ఉబ్బి ఉన్న చర్మం మరింత చికాకుకు గురవుతుందట. అలాగే మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివి అస్సలు చేయకూడదట. ఇలా చేస్తే బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చని చెబుతున్నారు.
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫౌండేషన్, పౌడర్ అద్దుకోకూడదని చెబుతున్నారు. ఒకవేళ మేకప్ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తుడిచేసుకోవాలని చెబుతున్నారు. వీలు ఉంటే నూనె లేని సౌందర్య సాధనాలు, మొటిమలకు కారణం కానివి ఎంచుకోవాలట. మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు అతిగా మేకప్ వేసుకోకూడదట..
మనలో చాలా మంది తరచూగా నూనె పెట్టి రాత్రంతా వదిలేస్తుంటారు. ఇలా తల మీది నూనె నుదురుకు తాకి, మొటిమలు వచ్చే అవకాశముందట. అప్పటికే ఉన్న మొటిమలు మరింత ఎక్కువ అవుతాయట. ఇంకా నూనె ముఖం మీదికి వ్యాపించి, చర్మ రంధ్రాలను మూసేయవచ్చట. అందుకే మృదువైన షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలని చెబుతున్నారు. ఒకవేళ పొడవైన జుట్టున్నట్టయితే ముఖం మీదికి రాకుండా చూసుకోవాలట.