Site icon HashtagU Telugu

Sesame Laddu : ఆడవాళ్లకు బలాన్నిచ్చే నువ్వుల లడ్డు.. తయారీ విధానం..

How to Prepare Women's Healthy Food Sesame Laddu

Nuvvula Laddu

Sesame Laddu : మన పెద్దవారు ఎప్పుడూ ఆడపిల్లలకి, మహిళలకు నువ్వుల లడ్డు తినమని చెబుతారు. నువ్వుల లడ్డు తినడం వల్ల ఆడవాళ్లకు ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయి. ముఖ్యంగా నడుం నొప్పి రాకుండా ఉంటుంది, వచ్చినా తగ్గుతుంది. ఇప్పటికీ మనం అందరం ఆడపిల్ల మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు నువ్వుల లడ్డును చేసి తినిపిస్తాము. దీనినే చిమ్ని అని కూడా అంటారు. ఎందుకంటే ఈ నువ్వుల లడ్డు తినడం వలన నడుం నొప్పి లేదా ఇంకా ఏదయినా నొప్పులు ఉన్నా తగ్గుతాయి. అలాగే పీరియడ్స్ టైంలో బలాన్ని ఇచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వుల లడ్డు.

నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు..

* నువ్వులు 100 గ్రాములు
* కొబ్బరి పొడి 50 గ్రాములు
* బెల్లం 150 గ్రాములు
* యాలకులు రెండు

నువ్వులను ఎండలో ఉంచి తరువాత ఆ నువ్వులను ఒక మూకుడులో వేసి దోరగా వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి దగ్గర ఉండి వేయించుకోవాలి. లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. వేగిన నువ్వులను తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లం కొద్దిగా మెత్తగా దంచుకోవాలి. యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి. వేయించుకొని ఉంచిన నువ్వులలో పావు వంతు నువ్వులు తీసుకొని మెత్తగా మిక్సి పట్టుకోవాలి. పొయ్యి ఆన్ చేసి ఒక మూకుడులో బెల్లం వేసి కరగనివ్వాలి అది కరిగిన తరువాత దానిలో యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి. అవి కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆ బెల్లం, కొబ్బరిపొడి, యాలకుల మిశ్రమంలో నువ్వులు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి. కలిపిన తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా రౌండ్ గా చేసుకోవాలి. అయితే లడ్డు చేసేటప్పుడు మన చేతికి నెయ్యి రాసుకుంటే ఇంకా మంచిది. రౌండ్ గా లడ్డు లాగా ఆ మిశ్రమాన్ని చేసుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన మరియు ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు తయారైనట్లే. ఈ లడ్డులను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఆడవాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.

 

Also Read : Coriander : కొత్తిమీరను ఎక్కువ కాలం నిలువ ఉంచాలంటే ఏం చేయాలి..?