Mango Ice Cream : మ్యాంగో ఐస్ క్రీం ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

బయట దొరికే మ్యాంగో ఐస్ క్రీంలో ఫ్లేవర్ మాత్రమే కలుపుతారు కానీ మనం ఇంటిలో చేసుకునే దానిలో ఫ్లేవర్ కలపకుండా చేసుకుంటాము. కాబట్టి మనం ఇంటిలో చేసుకునే మ్యాంగో ఐస్ క్రీం ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 11:00 PM IST

ఎండాకాలం(Summer)లో ఎక్కువగా దొరికే మామిడిపండు(Mango)ను ఉపయోగించి పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీం(Mango Ice Cream)ను తయారుచేసుకోవచ్చు. పిల్లలు బయట ఐస్ క్రీంలు తినకుండా ఇంట్లో తయారుచేసే మ్యాంగో ఐస్ క్రీం తినడం వలన అది వారి ఆరోగ్యానికి కూడా మంచిది. బయట దొరికే మ్యాంగో ఐస్ క్రీంలో ఫ్లేవర్ మాత్రమే కలుపుతారు కానీ మనం ఇంటిలో చేసుకునే దానిలో ఫ్లేవర్ కలపకుండా చేసుకుంటాము. కాబట్టి మనం ఇంటిలో చేసుకునే మ్యాంగో ఐస్ క్రీం ఎంతో రుచిగా కూడా ఉంటుంది.

మామిడి పండ్లు ఒక ఐదు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని మిక్సి లో వేసి మెత్తని గుజ్జు లాగా చేసుకోవాలి. దానిలో కొద్దిగా పాలు పోసుకొని మళ్ళీ మిక్సి పట్టుకోవాలి. దీనిని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకొని దానిలో కొద్దిగా నీరు కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. పాలు కాగిన తరువాత మార్కెట్ లో దొరికే చైనా గ్రాస్ ను దీనిలో కలపాలి. దీనిలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు పొడి చేసి కూడా కలుపుకోవచ్చు. దీనిలో కొద్దిగా యాలకులు పొడి వేసి కలుపుకోవాలి.

తరువాత స్టవ్ మీద నుండి తీసి గిన్నెను కింద పెట్టాలి. అది పూర్తిగా చల్లారిన తరువాత మనం మిక్సి పట్టిన మ్యాంగో గుజ్జును దీనిలో వేసి బ్లెండర్ ను ఉపయోగించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో పోసి ఉంచుకోవాలి. తరువాత ఆ బాక్స్ ని డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. అది గడ్డ కట్టిన తరువాత బయటకు తీసుకోవాలి. అంతే చల్లచల్లని మ్యాంగో ఐస్ క్రీం రెడీ. దీనికి ఇంకొంచెం టేస్ట్ రావడానికి ఇంకో మామిడిపండుని చిన్న చిన్న ముక్కలు కోసి వాటిని, బాదంపప్పు పొడిని గార్నిష్ లాగా వేసుకోవచ్చు. అంతే పిల్లలకి ఇలా ఇంట్లో చేసిన మ్యాంగో ఐస్ క్రీం గిన్నెలో వేసి ఇస్తే చల్లచల్లగా ఎంతో ఇష్టంగా తింటారు.

 

Also Read : Neera: వామ్మో నీరా తో ఎక్కువగా అన్ని రకాల ప్రయోజనాలా?