సొరకాయతో(Bottle Gourd) కూర, పచ్చడి చేసుకుంటాం. సాంబార్ లలో వేసుకుంటాం. సొరకాయ అప్పాలు, సొరకాయ హాల్వా కూడా చేసుకుంటాం. అయితే సొరకాయ, సగ్గుబియ్యం(Tapioce Pearls) కలిపి పాయసం కూడా తయారుచేస్తారు. సొరకాయను విడిగా తినని వారు పాయసం చేసినప్పుడు ఇష్టంగా తింటారు. స్వీట్ కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సొరకాయ, సగ్గుబియ్యం ఈ రెండూ మన శరీరానికి చలవ చేస్తాయి.
సొరకాయ సగ్గుబియ్యం(Sorakaya Saggubiyyam Payasam) పాయసం తయారీకి కావలసిన పదార్థాలు:-
* నెయ్యి నాలుగు స్పూన్లు
* జీడిపప్పు కొద్దిగా
* బాదం పప్పు కొద్దిగా
* ఎండు ద్రాక్ష కొద్దిగా
* సొరకాయ తురుము ఒక కప్పు
* కాచి చల్లార్చిన పాలు అరలీటరు
* నానబెట్టిన సగ్గుబియ్యం అరకప్పు
* పంచదార అరకప్పు
* పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా
* యాలకుల పొడి ఒక స్పూన్
ఒక గిన్నెలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లో తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో సొరకాయ తురుము వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి. అనంతరం అందులోనే పాలు, సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పంచదార కరిగిన తరువాత మొత్తం దగ్గరకు అయ్యేవరకు కలబెట్టాలి. తరువాత కుంకుమ పువ్వు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి పాయసాన్ని కలబెట్టుకోవాలి. ఇంతే సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ.
Also Read : Oats Soup : ఓట్స్‌తో సూప్ తాగారా ఎప్పుడైనా? ఓట్స్ సూప్ తయారీ విధానం..