పల్లీలు(Peanuts), బెల్లం(Jaggery) రెండూ మన ఆరోగ్యానికి మంచివి. పల్లి పట్టి ఈ రెండింటిని కలిపి తయారుచేస్తాము. పల్లి పట్టిలు(Peanut Chikki) ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని మనం బయట షాపుల్లో దొరికే వాటి లాగా ఇంటిలోనే తయారుచేయవచ్చు.
పల్లి పట్టి తయారీకి కావలసిన పదార్థాలు:-
* పల్లీలు రెండు కప్పులు
* బెల్లం రెండు కప్పులు
* నెయ్యి రెండు స్పూన్
* కొన్ని నీళ్లు
* యాలకుల పొడి కొద్దిగా
ముందు ఒక చిన్న మూకుడు తీసుకొని దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీలకు పొట్టు తీసి వాటిని నలిపితే రెండు ముక్కలుగా అవుతాయి. ఇంకొక మూకుడు తీసుకొని దానిలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. అది ముదురు పాకం వచ్చేవరకు ఉడికించాలి. నీళ్ళల్లో బెల్లం పాకం వేసి ముద్దలాగా చేసి అది ఉండలాగా చేయడానికి వీలుపడుతుందా లేదా అనేది చూడాలి. ఉండలాగా వస్తే అది ముదురుపాకం వచ్చినట్లు అప్పుడు మనం పొట్టు తీసి రెడీ చేసుకున్న పల్లీలు బెల్లం పాకంలో వేసి బాగా కలబెట్టాలి. చివరకు నెయ్యి, యాలకుల పొడిని వేసి కలబెట్టాలి.
ఒక బటర్ పేపర్ తీసుకొని దానిని ఒక ప్లేటులో ఉంచి దాని మీద ఈ మిశ్రమాన్ని వేయాలి. మొత్తం సమానంగా ఉండేలా చూడాలి. ఒక రెండు నిముషాలు అయిన తరువాత దానిని మనకు కావలసిన షేప్స్ లో గాట్లు పెట్టుకోవాలి. ఇక దానిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత బట్టర్ పేపర్ నుండి పల్లీపట్టీలను వేరు చేసుకోవాలి. వీటిని గాలి తగలకుండా ఉంచితే ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఈ విధంగా మనం మన ఇంటిలో సులభంగా తొందరగా పోషకాలను అందించే పల్లి పట్టిలను తయారుచేసుకోవచ్చు.
Also Read : Guava Leaves: జామ ఆకులతో అలా చేస్తే చాలు.. ముఖంపై మచ్చలు మాయం?