Site icon HashtagU Telugu

Minapa Vadiyalu : ఎండాకాలం స్పెషల్ మినప వడియాలు.. ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

How to prepare Minapa Vadiyalu in Summer

How to prepare Minapa Vadiyalu in Summer

ఎండాకాలం(Summer) ఎండలతో కష్టాలతో పాటు ఫుడ్ ప్రియులకు మాత్రం బోలెడంత ఇష్టాలు కూడా ఉంటాయి. ఎండాకాలం స్పెషల్ మామిడి(Mango), పుచ్చకాయ(Watermelon) లాంటివి తినడం, ఎండ నుంచి తప్పించుకోవడానికి లస్సి, మజ్జిగ, రకరకాల పానీయాలు తాగడం చేస్తుంటారు. అలాగే కొంతమంది ఎండాకాలంలో సంవత్సరానికంతా సరిపోయే మామిడికాయ పచ్చళ్ళతో పాటు రకరకాల వడియాలు కూడా చేసుకుంటారు. అలాంటి వడియాల్లో ఆరోగ్యానికి కూడా పనికొచ్చే మినప వడియాలు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మినప వడియాలు మన ఆరోగ్యానికి మంచివి, అంతే కాకుండా ఎంతో రుచిగా కూడా ఉంటాయి. పప్పు, సాంబార్ లోకి కరకరలాడుతూ చాలా బాగుంటాయి కూడా.

మినప వడియాల తయారీకి కావలసిన పదార్థాలు :

* పొట్టు మినప పప్పు అరకేజి
* పచ్చిమిర్చి ఏడు లేదా ఎనిమిది
* జీలకర్ర ఒక స్పూన్
* అల్లం చిన్న ముక్క
* ఉప్పు తగినంత

మొదట మినప పప్పును బాగా కడిగి ఒక రోజు ముందు నీళ్ళల్లో పప్పు మునిగేవరకు నీళ్లు పోసి నానబెట్టాలి. మరునాడు ఉదయం ఆ పప్పును కడిగి గ్రైండర్ లో వేసుకోవాలి. పప్పు రుబ్బేటప్పుడే ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెయ్యాలి. మొత్తం పిండి మెత్తగా అయిన తరువాత ఒక గిన్నెలో తీసుకొని ఉంచుకోవాలి. వడియాలు పెట్టడానికి పిండి రెడీ అయినట్లే.

ఒక పలుచటి కాటన్ వస్త్రం లేదా పాలిథిన్ షీట్ ని ఎండలో పెట్టుకొని దానిపై వడియాల పిండిని ఉపయోగించి మనకు నచ్చిన డిజైన్స్ లో వడియాలు పెట్టుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ జారకుండా ఉండేలా చేసుకొని ఒక గరిటెతో సులువుగా వడియాలు పెట్టవచ్చు. అదే చేతితో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది మినప వడియాలు చిన్న చిన్నగా గుండ్రంగా పెట్టుకుంటారు. అలా ఉంటేనే వడియాలు వేయించినప్పుడు త్వరగా వేగుతాయి.

ఆ వడియాలు రెండు రోజుల పాటు ఎండలో పెట్టాలి. మూడవ రోజున వాటిని పాలిథిన్ షీట్ పైన నుండి తీసేసి మళ్ళీ ప్లేట్స్ లో పెట్టి ఎండలో పెట్టాలి. అప్పుడు వడియాలు బాగా కరకరలాడుతాయి. ఈ విధంగా తయారైన వడియాలు మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. వీటిని మనం వేయించుకునేటప్పుడు చిన్న మంట మీద వేయించుకోవాలి అప్పుడే మినప వడియాలు బాగుంటాయి. ఇంకే ఈ సమ్మర్ లో మీరు కూడా మినప వడియాలు తయారుచేసుకోండి.

 

Also Read :   Coriander Leaves: కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు?