మామూలుగా బీరకాయతో తయారు చేసే వంటకాలు అనగానే బీరకాయ కర్రీ, బీరకాయ మసాలా కర్రీ అని చెబుతుంటారు. అయితే కేవలం ఇవి రెండు రకాలు మాత్రమే కాకుండా బీరకాయ పోపు కూర, బీరకాయ పొట్టు కూర, బీరకాయ ఎగ్ ఫ్రై, బీరకాయ బజ్జి ఇలా రకరకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలా వరకు బీరకాయతో ఎటువంటి కూరలు తయారు చేసినా కూడా బీరకాయ తొక్క తీసేసి కూరలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా బీరకాయ తొక్కతో కూరలు చేశారా. తొక్కతో కూరలు ఏంటి అనుకుంటున్నారా. అవును బీరకాయ తొక్క పచ్చడి. వినడానికి కాస్త వెరైటీగా ఉన్న ఈ రెసిపీ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బీరకాయ తొక్క పచ్చడికి కావలసిన పదార్థాలు:
బీరకాయ తొక్కలు – 1 కప్,
వెల్లుల్లి – 4
కరివేపాకు ఆకులు – గుప్పెడు
నూనె – తగినంత
టమాటో – 1
పచ్చిమిర్చి – 10
ఆవాలు – అరస్పూన్
జీలకర్ర – అరస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పచ్చి శనగపప్పు – అర స్పూన్.
బీరకాయ తొక్క పచ్చడి తయారీవిధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి పచ్చిమిర్చిని వేసి ఒక ఐదు నిముషాలు వేపుకోవాలి. ఆ తరవాత అందులో బీరకాయ తొక్కలను వేసి మగ్గేంత వరకు మూతపెట్టాలి. మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక పావుగంట ఆగిన తరవాత అందులో టమాటోను చిన్న ముక్కలుగా చేసి వెయ్యాలి. టమాటో కూడా మగ్గిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమానికి కాస్తంత జీలకర్ర, ఉప్పు చేర్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి, నూనె వేసి, కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి పచ్చడికి తాలింపు పెట్టుకుంటే, రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి రెడీ. ఒకవేళ మిక్సీలో వేసుకుంటే టేస్ట్ రాదు అనుకున్న వారు రోకలిలో వేసి దంచుకోవచ్చు. చివరిగా తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్క పచ్చడి రెడీ.