మామూలుగా శీతాకాలంలో చాలామందికి పెదవులు పగలడం మనం చూసే ఉంటాం. ఎక్కువ శాతం మందికి శీతాకాలంలోనే పెదవులు పగులుతూ ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సీజన్ లలో పెదవులు పగిలి ఒక్కోసారి రక్తం వచ్చి తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలా పెదవులు పగిలినప్పుడు చాలామంది అనేక రకాల క్రీమ్లు జెల్ లు అప్లై చేస్తూ ఉంటారు. అవి కొద్దిసేపు మాత్రమే ఉండి ఆ తర్వాత మళ్లీ పెదవులు డ్రై గా మారుతూ ఉంటాయి. ఇలా పెదవులు డ్రైగా మారినప్పుడు కొంతమంది నాలుకతో తడి చేస్తూ ఉంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు. శరీరంలో పోషకాలను లోపించినప్పుడు పెదవులు పగిలే అవకాశం ఉంటుందట.
శరీరంలో ఎటువంటి పోషకాలు లోపించినప్పుడు పెదవులు పగులుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెదవులపై చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే గాలి ఎక్కువగా వీచినా చలి పెట్టిన సూర్యరష్మి ఎక్కువగా ఉన్నా కూడా వెంటనే పెదవులు పగులుతూ ఉంటాయి. అంతర్గత పరిస్థితులు కూడా ఒక్కోసారి పెదవులపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. డిహైడ్రేషన్ కారణంగా కూడా పెదవులు ఇలా పగులుతూ ఉంటాయి. విటమిన్ బి లోపం వల్ల కూడా మన పెదవులు పగులుతుంటాయట. నవ్వుతున్నప్పుడు నోటి మూలల్లో పగుళ్లు కనిపిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విటమిన్ బి లోపం ఉన్నట్టే అంటున్నారు. విటమిన్ బి అనేది నీటిలో కరిగే విటమిన్ల సమూహం అని చెబుతున్నారు. ఇవి శరీరంలోని వివిధ కార్యకలాపాలకు చాలా అవసరం అని చెబుతున్నారు.
మీ శరీరంలో ఈ, బి విటమిన్లు లేకపోతే మీ పెదవులు పొడిబారుతాయట. అలాగే విటమిన్ బి12 లోపం వల్ల కూడా పెదవుల పగుళ్లు, బొబ్బలు ఏర్పడతాయని చెబుతున్నారు. మాంసాహారులతో పోల్చుకుంటే శాఖాహారులకు విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే విటమిన్ బి 12 ప్రధానంగా మాంసం లోనే కనిపిస్తుందని చెబుతున్నారు. పాల ఉత్పత్తులు గింజలు ఆకుకూరల్లో కూడా ఈ విటమిన్ బి12 ఉంటుంది. అదేవిధంగా విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టుకు, చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయట. విటమిన్ సి కూడా మన పెదవులకు ఎంతో అవసరమైన పోషకం. అందుకే మీ శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే పెదవులు పొడిబారుతాయట. అలాగే పగుళ్లు కూడా వస్తాయట.
నారింజ, టాన్జేరిన్లు, నిమ్మకాయలు, ద్రాక్ష, టమోటాలు, బంగాళాదుంపలు, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి సిట్రస్ పండ్లను తింటే విటమిన్ సి అందుతుందని చెబుతున్నారు. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో జింక్ కూడా ఒకటి. ఇది మన పెదవులను ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుందట. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, శరీరంలోని మిగిలిన భాగాలతో పాటుగా పెదవులు ఆరోగ్యంగా ఉండటానికి జింక్ సరఫరా అవసరం అని చెబుతున్నారు. అలాగే శరీరంలో ఐరన్ లోపించినప్పుడు కూడా పెదవులు పొడిబారుతాయట. కాబట్టి మీకు కూడా ఇలా పెదవులు పగులుతుంటే ఆయా విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల ఈ పెదవులు పొడిబారే సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు.